విశ్వసనీయత ఎందుకు కోల్పోయాం?
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గం అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ ఏపీ శాఖ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఏమి చేయాలనే దానిపై అంతర్మథనం ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం బుధ, గురువారాల్లో సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వి.సత్యనారాయణమూర్తి, పీజే చంద్రశేఖర్, జి.ఓబులేసు, రావుల వెంకయ్య, జల్లి విల్సన్ తదితరులు హాజరయ్యారు. ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోవడం కార్యదర్శివర్గాన్ని తీవ్రంగా కలవరపరిచింది.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రజల ఆలోచనా సరళిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది. ఇకపై క్రియాశీల (మిలిటెంట్) పోరాటాలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని నిర్ణయించింది. చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున సభ దృష్టిని ఆకర్షించేందుకు నిత్యం జనం మధ్యలో ఉండాలని తీర్మానించింది. ఇందుకోసం తక్షణ సమస్యలుగా రుణమాఫీ, అసంఘటిత కార్మికులు, కౌలు రైతుల సమస్యల్ని గుర్తించింది.