గిరిజన చట్టాలు అమలు చేయాలి
గర్జించిన గిరిజనులు
గాంధీనగర్ : పోలవరం దిగువన గిరిజన నిర్వాసితులకు భూములివ్వాలని, బాక్సైట్ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజనులు గర్జించారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో గిరిజన గర్జన పేరుతో గురువారం సభ నిర్వహించారు. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా మహాత్మగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్ రోడ్డు మీదుగా లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్, న్యూఇండియా హోటల్ సెంటర్ మీదుగా గ్రంథాలయానికి చేరుకున్నారు. గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో ఈటెలు, విల్లంబులు, బళ్లాలు, కత్తులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు.
అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఏ ప్రాజెక్టు ప్రారంభించిన గిరిజనుల జీవనాధారమైన భూములే లాక్కుంటున్నారని మండిపడ్డారు. కొండ ప్రాంతాల్లో భూగర్భ ఖనిజాలైన బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని, పాలక ప్రభుత్వాల అండదండలతోనే తవ్వకాలు సాగుతున్నాయన్నారు. గిరిజన తండాల్లో విద్యుత్, రోడ్లు,తాగునీరు లేక అల్లాడుతున్నారన్నారు. వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్నారు.
ప్రైవేటు రంగంలోనూ వీరికి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పార్టీ సహాయ కార్యదర్శి జేవీఎస్ మూర్తి , మాజీ ఎమ్మెల్యే జల్లి విల్సన్ మాట్లాడుతూ విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా దాని ఊసేత్తడం లేదన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేసే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. పట్టిసీమ బాధితులకు ఎకరానికి రూ. 25 లక్షలు ఇస్తూ, పోలవరం ముంపు బాధితులకు ఎకరానికి రూ. 1.15 లక్షలు ఇస్తున్నారని ఇది దుర్మార్గమన్నారు.
గిరిజన నిర్వాసితులకు పోలవరం దిగువన హెక్టార్ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారావు, బీమలింగప్ప, చంద్రానాయక్, గిరిజన సమాఖ్య విశాఖ జిల్లా నాయకులు కె.భూషణరావు, సత్యనారాయణ, మున్నంగి నర్సింహులు పాల్గొన్నారు.