బాక్సైట్‌ దోపిడీ గుట్టు రట్టు | Chandrababu didi Injustice to 10 lakh tribal families | Sakshi
Sakshi News home page

బాక్సైట్‌ దోపిడీ గుట్టు రట్టు

Published Sun, Mar 31 2019 4:28 AM | Last Updated on Sun, Mar 31 2019 4:42 AM

Chandrababu didi Injustice to 10 lakh tribal families - Sakshi

ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం హడావిడిగా కుంభకోణాలకు దిగజారడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2004 ఎన్నికలకు ముందు కూడా, షెడ్యూల్‌ వెలువడిన తర్వాత.. ఆపద్ధర్మ సీఎం హోదాలో ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని కంపెనీకి స్టేడియంల నిర్మాణం పేరిట హైదరాబాద్‌ నడిబొడ్డున రూ.8,500 కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని కేవలం రూ.4 కోట్లకే కట్టబెట్టేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

బాక్సైట్‌ నిక్షేపాల వెలికితీత వల్ల మూడు జిల్లాల్లోని 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుంటుంబాల బతుకులు నాశనమవుతాయి. అడవిపై తమ హక్కులను కోల్పోతారు. వారంతా తండాలను వదులుకుని వెళ్లాల్సి వస్తుంది. వారు తమకు సహజ సిద్ధంగా, స్థానికంగా దొరికే ఉపాధిని కోల్పోతారు. వారి సంస్కృతి చిన్నాభిన్నమవుతుంది. బాక్సైట్‌ వెలికితీత పర్యావరణంపై కూడా 
తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 

సాక్షి, అమరావతి: చంద్రబాబు బాక్సైట్‌ కుంభకోణం గుట్టు రట్టయ్యింది. బాక్సైట్‌ తవ్వకాలకు తాను వ్యతిరేకమని ఎప్పటికప్పుడు అవాస్తవాలు వల్లె వేస్తూ గిరిజనులను మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి.. ఎన్నికల ముందు ముసుగు తీసేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఓటమి భయంతో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన.. అత్యంత రహస్యంగా.. వంద, రెండొందల కోట్లు కాదు.. ఏకంగా రూ.41 వేల కోట్ల విలువైన బాక్సైట్‌ నిక్షేపాల వెలికితీతకు అనుమతిచ్చేశారు. మూడు జిల్లాల్లో ఏకంగా 10 లక్షల గిరిజన కుంటుబాలను రోడ్డుపాలు చేసే దారుణ కృత్యానికి తెగబడ్డారు. బిజినెస్‌ రూల్స్‌ పాటించలేదు. ఆర్థిక శాఖ పరిశీలనకూ పంపలేదు. ఎన్నికల షెడ్యూల్‌ వెలవడటానికి ఐదురోజుల ముందు అత్యంత రహస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంతో ఆమోదముద్ర వేయించారు. విదేశాలతో అంతర్గత ఒప్పందమూ చేసుకున్నారు. ఇదే అంశంపై గతంలో తాను చేసిన తప్పును ఓ అధికారిపై నెట్టేసి, ఆ అధికారిని బలిచేసి చంద్రబాబు తప్పించుకున్నారు. గిరిజనలు, వైఎస్సార్‌సీపీ ఆందోళనతో అప్పట్లో యూటర్న్‌ తీసుకున్న ముఖ్యమంత్రి.. ఎన్నికల సమయంలో ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో.. ఇప్పుడు అదే నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి గిరిజనులను దెబ్బకొట్టేలా గుట్టుగా పనికానిచ్చేశారు.

గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ నేపథ్యంలోనే అధికార టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఇటీవల మావోయిస్టుల చేతిలో చనిపోయారు. గిరిజన ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై అధికారవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ఇది పైకి రూ.41 వేల కోట్ల ఒప్పందంగా కన్పిస్తున్నా.. ఏకంగా లక్ష కోట్ల దోపిడీ దాగి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం కుంభకోణాలకు పాల్పడటం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2004 ఎన్నికలకు ముందు కూడా, షెడ్యూల్‌ వెలువడిన తర్వాత.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని కంపెనీకి స్టేడియంల నిర్మాణం పేరిట హైదరాబాద్‌ నడిబొడ్డున రూ.8,500 కోట్ల విలువైన 850 ఎకరాల భూమిని కేవలం రూ.4 కోట్లకే కట్టబెట్టేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.    


వేల కోట్ల సంపదపై చంద్రబాబు కన్ను
ఇసుక, మట్టి దేన్నీ వదలకుండా దోచుకుని, ప్రాజెక్టుల అంచనాలు అడ్డగోలుగా పెంచేసి కమీషన్లు దండుకున్న చంద్రబాబు.. మళ్లీ అధికారం ఆశలు అడుగంటిన చివరిదశలో కూడా వేల కోట్ల అవినీతికి తెరతీశారు. మూడు జిల్లాల్లోని అత్యంత విలువైన బాక్సైట్‌ వెలికితీతకు నిర్ణయం తీసుకుని, ఈ నెల 5వ తేదీన ఎలాంటి కనీస నిబంధనలూ పాటించకుండా కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించారు. అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఇందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ అధికారుల పరిశీలనకు పంపించలేదని, కేవలం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు దృష్టికి మాత్రం తీసుకువెళ్లి ఈ నెల 3వ తేదీన ముఖ్యమంత్రి ఆమోదంతో 5వ తేదీన కేబినెట్‌లో ఆమోదం తీసుకున్నట్లు గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస శ్రీనరేశ్‌ సంబంధిత ఫైలులో పేర్కొనడం గమనార్హం. కాగా అదేరోజు ప్రత్యేకంగా బాక్సైట్‌ తవ్వకాల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రత్యేక కార్పొరేషన్‌..
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 615.27 మిలియన్‌ టన్నుల బాక్సైట్‌ నిల్వలున్నాయని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బాక్సైట్‌తో పాటు మాంగనీస్, బంగారం, ఇతర ప్రధానమైన ఖనిజ సంపద వెలికి తీయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా ఏపీ మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్‌కు 23 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్‌ బాడీని ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్‌ స్వతంత్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రధానంగా విదేశీ ప్రైవేట్‌ సంస్థల ద్వారా జియో ఫిజికల్‌ సర్వే, జియో కెమికల్‌ సర్వేలు నిర్వహించడం, ప్రధాన ఖనిజాల నిల్వలపై అధ్యయనం చేయడంతో పాటు వేలం పాటల ద్వారా బాక్సైట్, ఇతర ప్రధాన ఖనిజాల వెలికితీతకు అనుమతించడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కార్పొరేట్‌ సంస్థలకు టెండర్ల ద్వారా లీజులకు ఇవ్వడం తదితర అంశాలన్నింటినీ కూడా కార్పొరేషన్‌ నిర్వహిస్తుంది. ఎవ్వరికైనా లీజుకు ఇచ్చిన తర్వాత దాన్ని సవాల్‌ చేయడానికి వీల్లేకుండా (ఆర్బిట్రేషన్‌ క్లాజు లేకుండా) జాగ్రత్తపడటం గమనార్హం. కాగా బాక్సైట్‌ నిల్వలను వెలికి తీసేందుకు ఇప్పటికే అస్ట్రేలియా, కెనడా, యూరప్‌ దేశాల్లోని ప్రైవేట్‌ సంస్థలతో అంతర్గత ఒప్పందాలను చంద్రబాబు కుదుర్చుకున్నారు. ఈ విషయం ఇప్పటివరకు బయటకు పొక్కకపోవడాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎంత గుట్టుగా వ్యవహరించారో అర్ధమవుతుంది.

అప్పుడు కాదని బుకాయించి...
వాస్తవానికి బాక్సైట్‌ నిల్వలపై 2015లోనే చంద్రబాబు కన్ను పడింది. విశాఖపట్నం జిల్లా చింతపల్లి జీలెల్లి అటవీ బ్లాకులోని 1,212 హెక్టార్లలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ 5–11–2015న జీవో నం.97 జారీ చేయించారు. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గిరిజనుల హక్కులను కాలరాస్తూ బాక్సైట్‌ తవ్వకాలకు ఎలా అనుమతిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. గిరిజనులూ ఉద్యమించారు. సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. జీవో నం. 97 నాకు తెలియకుండా వచ్చిందంటూ బుకాయించారు. ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై నెట్టేసి ఆయన్ను బలిచేశారు. నిజానికి సంబంధిత మంత్రితో పాటు ముఖ్యమంత్రి సంతకం లేకుండా ప్రభుత్వంలో ఎటువంటి జీవో జారీ కాదు. అలాంటిది తనకు తెలియకుండా జీవో జారీ అయిందని చంద్రబాబు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు కూడా ఎన్నికల హడావుడిలో గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చేయాలని భావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement