మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు
ఒంగోలు: తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందామంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయ సమావేశ మందిరంలో ‘ఏపీకి ప్రత్యేక హోదా– విభజన హామీల అమలు సాధన సమితి’ పేరుతో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవనా అన్న ముఖ్యమంత్రి నోటి నుంచే నేడు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ రావడం చూస్తుంటే భూమి గుండ్రంగా ఉందని చంద్రబాబుకు నేటికి అర్థం అయినట్లు ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాగ్రహాన్ని గమనించే చంద్రబాబు ట్యూన్ మార్చారన్నారు. 15ఏళ్ల ప్రత్యేక హోదా అం టూ పార్లమెంట్‌లో నినదించిన వెంకయ్యనాయుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్యాకేజీ ఇస్తామన్నా ఎందుకు ఘనంగా సన్మానాలు చేశారో ప్రజలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. మార్చి 1న ప్రత్యేక హోదాపై వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ ఉందని, మేధావులు, వివిధ సంఘాల నాయకులు హాజరుకావా లని పిలుపునిచ్చారు.
ఉద్యమ కార్యాచరణ రచించాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి సంబంధించి 50 శాతం మంది ప్రజలకు ఇంకా అవగాహన ఉండటంలేదన్నారు. హోదా వస్తే ప్రజలు జీఎస్‌టీ నుంచి మినహాయింపు పొందుతారని, తద్వారా వారికి నేరుగా ఏయే వస్తువుల్లో ఎంతెంత లాభం వస్తుందో కూడా తెలియజేసేవిధంగా ఉద్యమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఉద్దేశంలేదని, ఆదినుంచి ప్రత్యేక హోదాకోసం పోరుసాగిస్తూనే ఉందన్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 6వ తేదీవరకు కార్యాచరణను ప్రకటించి అవసరమైతే హోదాకోసం తమ పదవులను సైతం త్యాగం చేసుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడు తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటిం చారని గుర్తు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ మార్చి 1,3 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం, 5వ తేదీ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్న దృష్ట్యా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు , 6 ,7 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద ధర్నాలో పాల్గొనడం, 8వ తేదీ పార్లమెంట్ ముట్టడి, ప్ర«ధాని ఇంటివద్ద నిరసన చేపడతామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ, తేవా ల్సింది టీడీపీ అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.
ఉద్యమాలు అణిచివేసేందుకు కుట్ర
ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ ఉద్యమాలను సైతం అణిచివేసేందుకు ఫాసిస్టు తరహా రాజ్యాన్ని నడుపుతున్నారని మండి పడ్డారు. ప్రజాసంఘాల నాయకులు, మేధావులు , విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపీ అసలు ముద్దాయి అయితే, టీడీపీ ఏ2 ముద్దాయి అన్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని ప్రకటించిన చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా అంటుంటే ఏ జైలుకు పంపుతారో అధికారులు సెలవివ్వాలంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. కార్యక్రమానికి రిటైర్డ్ అదనపు జాయింట్ కలెక్టర్ షంషేర్ అహ్మద్ అధ్యక్షత వహించగా నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న), ఎంఎల్ నారాయణ, చుంచు శేషయ్య, తాటిపర్తి గోపాల్‌రెడ్డి, భీమనాథం హనుమారెడ్డి, శ్రీపతిప్రకాశం, కొమ్ము సామేలు, వినుకొండ రాజారావు, తోటరంగారావు, కొంగర నరసింహం, అరుణోదయ అంజయ్య, ఏఐఎస్‌ఎఫ్ పరుచూరి కుమారినంద, వినుకొండ రాజారావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, హెడ్మాస్టర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment