muppala nageshwara rao
-
టీడీపీకి 2019లో అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ..
సాక్షి, గుంటూరు : టీడీపీకి 2019 ఎన్నికల్లో అగ్రిగోల్డ్ బాధితుల దెబ్బ తగులుతుందని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్వాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల(మే) 30, 31 తేదీల్లో అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మఘోష పాదయాత్ర ఉంటుందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం నేటికి సమావేశం కాలేదు. ఎన్నో ఆశలతో బాధితులు ఎదురుచూస్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ సమస్యలపై పాలకుల్లో ఏ విధమైన చలనం లేదని విమర్శించారు. అందుకు నిరసనగా గుంటూరు నుంచి వెలగపూడి వరకు ‘ఛలో సెక్రటేరియట్’ కు పిలుపునిచ్చామన్నారు. పోలీసులకు పని లేకుండా శాంతియుతంగా ఈ నిరసన పాదయాత్ర చేపడతాం. 20 లక్షల అగ్రిగోల్డ్ బాధితులపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని కోరారు. అంతేకాక బాధితుల ఆర్తనాదాలను గమనించి తక్షణమే రూ. 3,965 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు ఆత్మహత్యలకు పాల్పడకుండా మా అసోసియేషన్ ఎంతో కృషి చేస్తోందని ముప్వాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణ ఉద్యమ పోరాటమే స్ఫూర్తి!
ఒంగోలు: తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందామంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయ సమావేశ మందిరంలో ‘ఏపీకి ప్రత్యేక హోదా– విభజన హామీల అమలు సాధన సమితి’ పేరుతో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవనా అన్న ముఖ్యమంత్రి నోటి నుంచే నేడు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ రావడం చూస్తుంటే భూమి గుండ్రంగా ఉందని చంద్రబాబుకు నేటికి అర్థం అయినట్లు ఉంది అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాగ్రహాన్ని గమనించే చంద్రబాబు ట్యూన్ మార్చారన్నారు. 15ఏళ్ల ప్రత్యేక హోదా అం టూ పార్లమెంట్లో నినదించిన వెంకయ్యనాయుడు తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్యాకేజీ ఇస్తామన్నా ఎందుకు ఘనంగా సన్మానాలు చేశారో ప్రజలకు టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. మార్చి 1న ప్రత్యేక హోదాపై వామపక్షాల ఆధ్వర్యంలో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక హోదాపై రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ ఉందని, మేధావులు, వివిధ సంఘాల నాయకులు హాజరుకావా లని పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణ రచించాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి సంబంధించి 50 శాతం మంది ప్రజలకు ఇంకా అవగాహన ఉండటంలేదన్నారు. హోదా వస్తే ప్రజలు జీఎస్టీ నుంచి మినహాయింపు పొందుతారని, తద్వారా వారికి నేరుగా ఏయే వస్తువుల్లో ఎంతెంత లాభం వస్తుందో కూడా తెలియజేసేవిధంగా ఉద్యమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఉద్దేశంలేదని, ఆదినుంచి ప్రత్యేక హోదాకోసం పోరుసాగిస్తూనే ఉందన్నారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 6వ తేదీవరకు కార్యాచరణను ప్రకటించి అవసరమైతే హోదాకోసం తమ పదవులను సైతం త్యాగం చేసుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడు తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ రాహుల్‌గాంధీ మద్దతు ప్రకటిం చారని గుర్తు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ మార్చి 1,3 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం, 5వ తేదీ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్న దృష్ట్యా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు , 6 ,7 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద ధర్నాలో పాల్గొనడం, 8వ తేదీ పార్లమెంట్ ముట్టడి, ప్ర«ధాని ఇంటివద్ద నిరసన చేపడతామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ, తేవా ల్సింది టీడీపీ అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఉద్యమాలు అణిచివేసేందుకు కుట్ర ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ ఉద్యమాలను సైతం అణిచివేసేందుకు ఫాసిస్టు తరహా రాజ్యాన్ని నడుపుతున్నారని మండి పడ్డారు. ప్రజాసంఘాల నాయకులు, మేధావులు , విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపీ అసలు ముద్దాయి అయితే, టీడీపీ ఏ2 ముద్దాయి అన్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అని ప్రకటించిన చంద్రబాబు నేడు ప్రత్యేక హోదా అంటుంటే ఏ జైలుకు పంపుతారో అధికారులు సెలవివ్వాలంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. కార్యక్రమానికి రిటైర్డ్ అదనపు జాయింట్ కలెక్టర్ షంషేర్ అహ్మద్ అధ్యక్షత వహించగా నల్లూరి వెంకటేశ్వర్లు(అన్న), ఎంఎల్ నారాయణ, చుంచు శేషయ్య, తాటిపర్తి గోపాల్‌రెడ్డి, భీమనాథం హనుమారెడ్డి, శ్రీపతిప్రకాశం, కొమ్ము సామేలు, వినుకొండ రాజారావు, తోటరంగారావు, కొంగర నరసింహం, అరుణోదయ అంజయ్య, ఏఐఎస్ఎఫ్ పరుచూరి కుమారినంద, వినుకొండ రాజారావు, ఆళ్ల వెంకటేశ్వరరావు, హెడ్మాస్టర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 5 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల నమోదు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ నెల 5న అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు నమోదు చేసుకుంటారని ఏపీ అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ముఖ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 660 మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో బాధితుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. సీఐడీ పర్యవేక్షణలో జరిగే ఈ నమోదు అవకాశాన్ని అగ్రిగోల్డ్ బాధితులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఖాతాదారులకు ఈ సమాచారం అందించేందుకు ప్రతీ మండలానికి పది మందితో కమిటీలు వేస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పోరాటంతో దిగివచ్చిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల పరిహారం విడుదల చేస్తూ జీవోలు ఇచ్చిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయడంలో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. పరిహారం అందజేతకు జీవోలు ఇచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోందని, తక్షణం బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీని టేకోవర్ చేసేందుకు ఎస్సెల్ గ్రూప్ రూ.10కోట్లు డిపాజిట్ చేసిందని, మరో నాలుగు వారాల్లో హైకోర్టుకు సంబంధించిన విధానం పూర్తి అవుతుందన్నారు. కొంతమంది బాధితుల వద్ద బాండ్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం తీసుకుందని, రూ.700కోట్ల వరకు చెక్‌లు ఇచ్చిందని, అటువంటి వారికి ఏ ఆధారం ఉన్న పరిగణలోకి తీసుకోవాలని ముప్పాళ్ల కోరారు. అగ్రిగోల్డ్ ఛైర్మన్‌కు మూడేళ్ల జైలు శిక్ష అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట రామరావుకు మూడేళ్ల జైలు శిక్షతో రూ.6 వేల జరిమాన విధిస్తూ బద్వేల్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్ధవరంలో 300 ఎకరాల భూమి గోల్మాల్ కేసులో ఈ శిక్షను ఖరారు చేసింది. -
‘విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు’
గుంతకల్లు రూరల్: అవినీతి రాజకీయాలను పారదోలే శక్తి కలిగిన విద్యార్థుల చేతుల్లోనే ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులను సోమవారం మండలంలోని బుగ్గ సంగమేశ్వరాల దేవాలయం ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన కనీసం ఒక్కహామీని కూడా నెరవేర్చలేకపోయిందన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న కారణంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలను మూతవేస్తూ విద్యను పేదలకు దూరం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్సన్, జిల్లా మాజీ నాయకులు నారాయణస్వామి, స్థానిక నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, పవన్‌కుమార్‌రెడ్డి, మురళిక్రిష్ణ, రాజశేఖర్, రాము రాయల్, ఎస్ఎండీ గౌస్, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కేంద్రప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమే..
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల అరండల్‌పేట (గుంటూరు) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులకు అంటిన అవినీతి మరకలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన లలిత్‌మోడికి సుష్మాస్వరాజ్, వసుంధరరాజేలు కొమ్ముకాయడం క్షమించరాని నేరమన్నారు. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వాని దేశంలో మరోసారి ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం కనిపిస్తోందని వ్యాఖ్యానించడం మోడీ, అమిత్‌షాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారన్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలు కుళ్లి కంపు కొడుతున్నాయన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడిని, తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ప్రజల చేత ఛీ కొట్టించుకొనే విధంగా దిగజారి పోతున్నారన్నారు. ఒకపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్న విధంగా కొనాలనుకున్న చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక సర్వేలో భాగంగా రాజధానిప్రాంతంలో 33,019 పేద కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిందని, అయితే ఆ లెక్కను తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పేదలకు పనికల్పించకుంటే రోజుకు రూ. 150 వంతున నెలకు రూ. 4,500 చెల్లించాలన్నారు. ఈ ప్రాంతంలో నివశిస్తున్న డ్వాక్రా సభ్యులకు పూర్తిగా రుణమాఫీ చేయాలన్నారు. ఆయా డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే నెల 4న తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వ్యవసాయకూలీలు, శ్రామిక మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు జి.వి.కృష్ణారావు, కేసాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.