సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల
అరండల్‌పేట (గుంటూరు) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, మంత్రులకు అంటిన అవినీతి మరకలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సుష్మాస్వరాజ్, స్మృతిఇరానీ, రాజస్థాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన లలిత్‌మోడికి సుష్మాస్వరాజ్, వసుంధరరాజేలు కొమ్ముకాయడం క్షమించరాని నేరమన్నారు. సాక్షాత్తు బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వాని దేశంలో మరోసారి ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం కనిపిస్తోందని వ్యాఖ్యానించడం మోడీ, అమిత్‌షాలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారన్నారు. మరోవైపు రాష్ట్ర రాజకీయాలు కుళ్లి కంపు కొడుతున్నాయన్నారు. ఏపీలో చంద్రబాబునాయుడిని, తెలంగాణలో కేసీఆర్‌ను ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ప్రజల చేత ఛీ కొట్టించుకొనే విధంగా దిగజారి పోతున్నారన్నారు.
ఒకపార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్న విధంగా కొనాలనుకున్న చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక సర్వేలో భాగంగా రాజధానిప్రాంతంలో 33,019 పేద కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిందని, అయితే ఆ లెక్కను తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పేదలకు పనికల్పించకుంటే రోజుకు రూ. 150 వంతున నెలకు రూ. 4,500 చెల్లించాలన్నారు. ఈ ప్రాంతంలో నివశిస్తున్న డ్వాక్రా సభ్యులకు పూర్తిగా రుణమాఫీ చేయాలన్నారు.
ఆయా డిమాండ్లను నెరవేర్చకుంటే వచ్చే నెల 4న తుళ్లూరులోని సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో వ్యవసాయకూలీలు, శ్రామిక మహిళలు, కూలీలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, నాయకులు జి.వి.కృష్ణారావు, కేసాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమే..
Published Mon, Jun 29 2015 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM
Advertisement