చాడ వెంకట్ రెడ్డి
సిద్ధిపేట: కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ నిబంధనలు అమలు చేస్తూ పేద, మధ్య తరగతి ప్రజలకు అన్యాయం చేస్తుందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. సిద్ధిపేటలో చాడ విలేకరులతో మాట్లాడుతూ.. అడ్డగోలుగా రేట్లు పెంచుతూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న ఆందోళనకు సీపీఐ మద్ధతు తెలుపుతోందని చెప్పారు.
రెండవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఇంత వరకు మంత్రివర్గ విస్తరణ చేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి కుంటు పడిందని వ్యాఖ్యానించారు. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలుస్తా, నాన్ బీజేపీ-నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. అన్ని డిపార్ట్‌మెంట్లలో పెండింగ్ బిల్లులు ఉండడం వల్ల ప్రగతి నిలిచిపోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారు.. బీసీల రిజర్వేషన్లు తగ్గించారని విమర్శించారు.
ఇప్పటి వరకు బీసీల జనాభా గణన పట్టించుకోలేదని, బీసీల గణన పట్ల టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల ఆందోళన న్యాయమైందని, వారు చేస్తున్న ఆందోళనకు సీపీఐ పూర్తి మద్ధతు ఇస్తోందని వ్యాఖ్యానించారు. బీసీ గణన పూర్తి చేసి ఎన్నికలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద తెచ్చిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. బీసీలకు అన్యాయం చేయవద్దని సీపీఐ కోరుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment