
సాక్షి, విశాఖపట్నం: ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు నిస్పృహలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగిపోయారని అన్నారు. 5 ఏళ్ళ పాలనలో 600 హామీలు ఇచ్చినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. జన్మభూమి కమిటీలకు పాలన అప్పగించి కింది స్థాయి వరకు దోచుకోమని అనుమతి ఇచ్చేశారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు.. ఘోరీ, గజనీలుగా మారి ఇసుక కూడా వదలకుండా ఐదేళ్లు దోపిడీ ప్రభుత్వాన్ని నడిపారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చుట్టూ ఉన్న వారంతా నేరస్తులేనని, రూ. 200 కోట్లు తీసుకుని రాజ్యసభకు పంపుతున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. దేశంలోని అత్యధిక సంపద కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏడీఆర్ నివేదించిందని తెలిపారు.
రాష్ట్రంలో 2 వేల రూపాయల నోటు కనబడటం లేదు అంటే.. అవన్నీ చంద్రబాబు నగదు పంపిణీ కోసం బ్లాక్ చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు బద్ధ విరోధి అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్‌లకు కక్కుర్తిపడుతున్న చంద్రబాబుకు పోలవరం నిర్మించాలనే ఉద్దేశం లేదన్నారు. జలయజ్ఞంలో ఏ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ వైఎస్ జగన్ సారథ్యంలో పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆఖరి పుట్టినరోజు నాడు కళలను పోషించమని 5 కోట్లతో 5 ఎకరాల్లో కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని పబ్లిక్ గార్డెన్స్‌లో చెబితే, తాను రెండు సార్లు లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని వెల్లడించారు.
ఎన్టీఆర్ పేరు ఉండకూడదు, నారావారి పార్టీగానే ఉండాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ కరపత్రాల్లో ఎన్టీఆర్ బొమ్మ లేకుండా, పేరు లేకుండా తెలుగుదేశం పార్టీని నడిపించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయివచ్చారని నిలదీశారు. చంద్రబాబు కున్న కులపిచ్చి మరొకరకు లేదని, సిట్ పై చర్యలను వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తామని దాడి వీరభద్రరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment