సాక్షి, హైదరాబాద్: తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్టు సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం ఆయన తన కుమారుడు హితేశ్‌తో కలిసి ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు, నరసరావుపేట నియోజకవర్గ లోక్‌సభ కో ఆర్డినేటర్ కృష్ణదేవరాయులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘హితేశ్ వైఎస్ జగన్‌తో కలిసి పనిచేస్తారు. మా నిర్ణయాన్ని వైఎస్ జగన్ స్వాగతించారు. గత రెండు ఏళ్లుగా వైఎస్ జగన్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీని నడుపుతున్నారు. ఆయన పడుతున్న కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం చూపెడతాడు. ప్రజలు కూడా ఆయన కష్టాన్ని గుర్తిస్తున్నార’ని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పనితీరు గాడి తప్పిందని విమర్శించారు. డబ్బులు లేవని చెబుతూ.. ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చంద్రబాబు దీక్షలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో, ఐదో విడుత రైతుల రుణమాఫీకి ఇంకా డబ్బులు విడుదల చేయలేదని అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెబుతున్నారని.. ఇంత విచిత్రమైన పాలనను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు పోస్ట్‌డేటెడ్ చెక్కుల పేరిట రాజకీయాలు చేయడాన్ని తప్పుపట్టారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. తన భార్య పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment