
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 506, 507 సెక్షన్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండానే విచారించి, జైలులో పెట్టే హక్కును పోలీసులకు ఇవ్వడం అంటే, పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాయడమే నన్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెట్టడానికి, జైలులో పెట్టడానికే ఈ చట్ట సవరణ ఉపయోగపడుతుందన్నారు. అన్యాయాలను అరికట్టడానికి, అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని కోరారు. ప్రజా స్వామ్యంపై సీఎం కేసీఆర్‌కు విశ్వాసం లేదని చెప్పారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టు ముందు నిలబడవని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో నిలదీస్తామని శ్రవణ్ అన్నారు.