
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఓడిపోతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు భయం పట్టుకుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్ అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ 58 వేల మంది కార్మికులున్న సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కార్మిక నాయకులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
సింగరేణిలో సమ్మెకాలానికి వేతనాలు ఇస్తామని, ఓపెన్ కాస్టులు లేకుండా చేస్తామని, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, మెడికల్ కాలేజీ ఇస్తామని, ఆస్తిపన్ను రద్దు చేస్తామని, తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినట్టే ఇచ్చి ఎంపీ కవిత అనుచరునితో కేసు వేయించారని ఆరోపించారు.
సింగరేణి ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులను కార్మికులు తరిమితరిమి కొడుతున్నారని, దీనికి భయపడిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారని శ్రవణ్ అన్నారు. లిక్కర్, డబ్బు, మేక పిల్లలను పంచుతూ కార్మికులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతున్నదని, సింగరేణి ఎం.డి. శ్రీధర్ టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై దొంగలెక్కలతో ముంచుతున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపితే అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.