
సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రూ.30 కోట్ల విలువైన ఇసుక అక్రమ రవాణాకు గురైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్టులో 7 కిలోమీటర్ల మేర తవ్వకాలు జరిపి, నది వరకు రోడ్డు వేశారని, దీని ద్వారానే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై మైనింగ్ మంత్రి కేటీఆర్‌కు కళ్ళు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.
సినీ పరిణామాలపై టాస్క్‌ఫోర్స్: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: సినిమా పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమలో జరుగుతున్నది ఆరోగ్యకరమైన పరిణా మం కాదని, మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. డ్రగ్స్ కేసు ఎంత వరకు వచ్చిందో ప్రభుత్వానికి కూడా తెలియదని పేర్కొన్నారు. మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు.