
సాక్షి, బెంగళూరు: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని, అలాంటిది దాదాపు 36 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ కర్ణాటక ఇన్‌చార్జ్ కెసి వేణుగోపాల్ పరోక్షంగా బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజెను విమర్శించారు. ఆమెపై ఇప్పటికే యర్నాకులం న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు.
కేఎస్‌ఆర్‌టీసీ కేరళలోని అలెప్పీకి ఏర్పాటు చేసిన బస్ సేవలను ఆయన శనివారమిక్కడ ఆరంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మొదటినుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ‘నాపై ఆరోపణలు చేసిన మహిళ పైనే 36 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయంటే ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతో మీరే అర్థం చేసుకోవచ్చ’ని అన్నారు. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందడం కేవలం ప్రకృతి వైపరీత్యమే అని, ఇలాంటి సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరని వేణుగోపాల్ పేర్కొన్నారు.
కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణుగోపాల్‌ను కాంగ్రెస్ కర్ణాటక ఇన్‌చార్జ్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ శోభా కరంద్లాజె నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా శుక్రవారం నిరసనలు చేపట్టింది. వేణుగోపాల్ పలువురు మహిళలను వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రానికి పంపడాన్ని వ్యతికరేకిస్తున్నామని ఈ సందర్భంగా శోభా కరంద్లాజె అన్నారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి రాకుండా చూడాలని సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేజే జార్జ్, దినేశ్ గుండురావులను కోరారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి వస్తే నల్లజెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కాగా, తనను రేపిస్ట్‌గా పేర్కొన్న శోభా కరంద్లాజెపై పరువునష్టం దావా వేసినట్టు వేణుగోపాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment