Shobha Karandlaje
-
తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఏపీకి పీసీ మోహన్
సాక్షి, న్యూఢిల్లీ: సంస్థాగత మార్పుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతిలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించేందుకు వీలుగా ప్రత్యేక ఎన్నికల అధికారుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం 29 మందితో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటకకు చెందిన లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌లను నియమించింది. వీరితో పాటు తమిళనాడుకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు పీయూష్‌గోయల్, అండమాన్ నికోబార్‌కు తమిళిసై సౌందర్‌రాజన్, బిహార్‌కు మనోహర్‌లాల్ ఖట్టర్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్‌కు భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్, పుదుచ్చేరికి తరుణ్ ఛుగ్‌లకు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు
సాక్షి, చెన్నై: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి ప్రాంతం గురించి శోభా కరంద్లాజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తమిళులుకు ఆమె క్షమాపణలు చెప్తూ ఎక్స్.కామ్‌లో పోస్ట్ చేశారు. ‘సోదరులు, సోదరీమణులకు నా క్షమాపణ. కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొంది, రామేశ్వరం కేఫ్ పేలుడుతో ముడిపడి ఉన్న నిందితుడి గురించే మాట్లాడాను. అయినప్పటికీ నా మాటలు మీకు బాధ కలిగించాయని నేను భావిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కరంద్లాజే ఎక్స్.కామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. To my Tamil brothers & sisters, I wish to clarify that my words were meant to shine light, not cast shadows. Yet I see that my remarks brought pain to some - and for that, I apologize. My remarks were solely directed towards those trained in the Krishnagiri forest, 1/2 — Shobha Karandlaje (Modi Ka Parivar) (@ShobhaBJP) March 19, 2024 కరంద్లాజే గతంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే? రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ విచారణలో తేలింది. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మహిళా నేత, కేంద్రమంత్రి కరంద్లాజే విమర్శలు చేశారు. సీఎం సంఘ విద్రోహ కార్యకాలపాల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పలు సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శోభా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎలాంటి అధికారం లేదు ‘శోభా మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రామేశ్వరం కెఫే బ్లాస్ట్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చర్యలు తీసుకోవాలి. అలాంటి వాదనలు చేసేందుకు మీకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. శోభాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో శోభా క్షమాపణలు చెబుతూ పోస్ట్ పెట్టడంపై వివాదం సద్దు మణిగింది. -
కాంగ్రెస్ వారికి బుర్ర లేదా?: శోభ
కర్ణాటక: గ్యారంటీ పథకాలకు హామీలిచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులకు తలలో మెదడు లేదా? అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె ప్రశ్నించారు. ఆమె బుధవారం చిక్కమగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కేంద్రం బియ్యంను గోడౌన్లో పెట్టింది గ్యారంటీ పథకాలకు ఖర్చు చేయడానికి కాదు. అత్యవసర పరిస్థితిలో ఉపయోగించుకోవడానికి అన్నారు. కేంద్రం అతివృష్టి, కరువు, సాంక్రమిక వ్యాధులు సోకిన సమయంలో అత్యవసరంగా బియ్యాన్ని ప్రజలకు అందించడానికి గోదాముల్లో నిల్వ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అరాచకత్వం మొదలైందని ఆరోపించారు. గ్యారంటీ పథకాలను ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు అది వదిలేసి బీజేపీ నాయకులపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
శోభక్కా, గాజులు పంపించు: శివకుమార్
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే వ్యాఖ్యలపై నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఆక్రోశం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేతుల గాజులు వేసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఖండిస్తూనే గాజులను పంపితే తాము వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన నిన్న కుందగోళలో విలేకర్లతో మాట్లాడారు. కుందగోళను దత్తతకు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు ఆశించిన దానికంటే అధికంగా అభివృద్ధి చేస్తామన్నారు. శోభా చేసిన గాజుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శోభక్క ఎప్పుడు పంపుతుందోనని తాను ఎదురు చూస్తున్నాన్నారు. సిద్ధరామయ్య రేవణ్ణపై ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 23 తర్వాత ‘సంకీర్ణం’ పతనం రాష్ట్రంలో ప్రభుత్వం బదిలీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. లోక్‌సభ ఫలితాల అనంతరం కర్ణాటకలోని కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. గురువారం ఆయన హుబ్బళి విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య సమన్వయ లోపమే సంకీర్ణ ప్రభుత్వానికి కారణం అవుతుందని చెప్పారు. గత 2018 విధానసభ ఎన్నికల్లో 104 స్థానాలు సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా.. కేవలం 37 సీట్లు సాధించిన జేడీఎస్ సీఎం కుర్చీ ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. అలాగే రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పీఠంపై ఉండటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అన్నారు. కాంగ్రెస్‌కు నైతిక విలువలు లేవని మండిపడ్డారు. కాగా బీజేపీకి ప్రస్తుతం ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి 106 మంది సభ్యుల బలం ఉందన్నారు. ప్రస్తుతం చించోళి, కుందగోళలో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని.. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 108కు చేరుతుందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఫలితంగా 23వ తేదీ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం పతనం దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్ని విలేకరుల ప్రశ్నకు బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. తమకు సంపూర్ణ బలం ఉన్ననాడే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఏ పార్టీతోనూ కుమ్మక్కయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మారడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
కర్ణాటక: బీజేపీ సంచలన ఆరోపణలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నడుమ.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీజేపీలో కలకలం రేపుతున్నది. మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు: జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100కోట్లు ఆఫర్ చేస్తున్నదన్న కుమారస్వామి ఆరోపణలను కొట్టిపారేసిన కాషాయదళం... ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కర్ణాటక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నదని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలే టార్గెట్‌గా వ్యవహారం నడుస్తున్నదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదులు వెళ్లాయి. బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే, జీఎం సిద్ధేశ్వర, పీసీ మోహన్‌లు ఉమ్మడిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. ‘‘కర్ణాటకలో అధికార దుర్వినియోగానికి సంబంధించి మా వద్ద స్పష్టమైన కారణాలున్నాయి. చట్టవిరుద్ధంగా మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే జోక్యం చేసుకోండి..’ అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ఆపద్ధర్మముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించాల్సిఉంది. కేంద్రానికి బీజేపీ ఎంపీ శోభ రాసిన లేఖ The #kannadigas mandate is clear and it favours BJP only. now they are tapping phones of @BJP4Karnataka ‘s leaders . its hard to see people can stoop this level for power. The saga of unholy nexus continues #KaranatakaVerdict pic.twitter.com/ebkTxgOlrQ — Shobha Karandlaje (@ShobhaBJP) May 16, 2018 -
అతను బతికే ఉన్నాడు
బెంగళూరు: కర్ణాటకలో సీఎం సిద్దరామయ్య హయాంలో ‘జిహాదీ’ల చేతిలో మరణించారని పేర్కొంటూ హిందూత్వ వాదుల పేరుతో కర్ణాటక బీజేపీ కార్యదర్శి శోభా కరంద్లాజే ఇటీవల ఒక జాబితా విడుదల చేశారు. 23 మందితో కూడిన ఆ జాబితాలోని ఉన్న మొదటి వ్యక్తి బతికే ఉన్న విషయం బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2015 సెప్టెంబర్ 20న అశోక్ పూజారి ‘జిహాదీ’ల చేతిలో మరణించినట్లు కరంద్లాజే పేర్కొనగా.. అతను ఉడుపి సమీపంలోని మూదాబిద్రిలో బతికే ఉన్నట్లు ఓ మీడియా సంస్థ పరిశోధనలో తేలింది. అయితే తనపై దాడి నిజమేనని, చనిపోలేదని అశోక్ పూజారి వెల్లడించాడు. -
ఆయన జయంతి జరిపితే.. ఖబడ్దార్
సాక్షి, బెంగళూరు: ఇప్పటికే టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలను జరిపి విమర్శలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య సర్కారు తాజాగా బహుమని సుల్తాన్ జయంతిని జరపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జయంతిని నిర్వహిస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే విషయమై బెంగళూరులో బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసి వేలమంది హిందువులను క్రూరంగా హత్య చేసిన బమమని సుల్తాన్ జయంతిని నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోసారి రాష్ట్రంలో మతఘర్షణలను రెచ్చగొట్టడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతామని చెప్పారు. కలబురిగిలోని బహుమని సుల్తాన్ కోటలో జయంతి వేడుకలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఆ వార్తలు అవాస్తవం: సీఎం సిద్ధు బహుమని సుల్తాన్ జయంతి వార్తలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసలు బహుమని సుల్తాన్ ఎవరో కూడా తమకు తెలియదని, అటువంటి పరిస్థితుల్లో ఆ జయంత్యుత్సవాలున నిర్వహించే అవకాశమే లేదన్నారు. మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలపై స్పందిస్తూ ఆ సంగతి నాకు తెలియదు, మంత్రినే అడగాలని సూచించారు. -
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్సే
బొమ్మనహళ్లి: దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ ఎంపీ శోభాకరందాజ్లే ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఉగ్రవాదులు, జీహాదిలని ఆరోపించిన దినేష్ గుండూ రావు, సీఎం సిద్దరామయ్యలు తక్షణమే రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి జైల్‌భరో నిర్వహిస్తామన్నారు. సిద్దరామయ్య ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తమను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. గురువారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో శోభాకరందాజ్లే విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపి కార్యకర్తలు చేతుల్లో తల్వార్లు,చాకులు పట్టుకోని తిరగలేదని అన్నారు. రాష్ట్ర హోం మంత్రి రామలింగారెడ్డి, కేపీసీసీ కార్యాధ్యక్షుడు దినేష్‌గుండూరావు వ్యాఖ్యలతో ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై ఉన్న కేసులను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటణలతో పొత్తు పెట్టుకోవాలని ముందుకెళ్లాలని యోచిస్తోందని ఆరోపించారు. -
నన్ను అరెస్టు చేసే దమ్ముందా?
సాక్షి, బెంగళూరు: దమ్ముంటే తనను అరెస్టు చేయాలని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే ప్రభుత్వానికి సవాలు విసిరారు. జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను జైలులో పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. హన్నావరలో సంఘ్ కార్యకర్త పరేశ్మేస్తా హత్యతోపాటు కావ్యా నాయక్ అనే విద్యార్థి పై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో శోభ పోస్టులు చేయడంతో ఆమెపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలయ్యింది. ఈ నేపథ్యంలో శనివారం బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె తీవ్ర ఆగ్రహావేశాలతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు నేను భయపడబోను. నన్ను అరెస్టు చేస్తే తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కొన్ని మైనారిటీ వర్గాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా, భారత సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న వారి పై కేసులు నమోదు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం ఎంతవరకూ సమంజసం’ అని మండిపడ్డారు. వీరశైవ– లింగాయత సముదాయం మధ్య చిచ్చుపెట్టి లింగాయత్ సముదాయానికి మైనారిటీ హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ భావించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని శోభ విమర్శించారు. మహదాయిపై రాహుల్ వైఖరేమిటి? మహదాయి సమస్య పరిష్కారం కోసం ట్రిబ్యునల్ పరిధిలోనే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడైన యడ్యూరప్ప, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనిచేస్తుంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని శోభ అన్నారు. గోవాలోని కాంగ్రెస్ నాయకులు కర్ణాటకకు చుక్క నీరుకూడా వదలమని చెబుతున్నారన్నారు. ఈ వ్యవహారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మహదాయిపై వారి వైఖరి ఏమిటనేది చెప్పాలని కోరారు. -
ఆమెపై పరువునష్టం దావా వేశా
సాక్షి, బెంగళూరు: తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని, అలాంటిది దాదాపు 36 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక మహిళ తనపై ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జ్ కెసి వేణుగోపాల్ పరోక్షంగా బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజెను విమర్శించారు. ఆమెపై ఇప్పటికే యర్నాకులం న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు రుజువైతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా తప్పుకుంటానని ప్రకటించారు. కేఎస్ఆర్టీసీ కేరళలోని అలెప్పీకి ఏర్పాటు చేసిన బస్ సేవలను ఆయన శనివారమిక్కడ ఆరంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వేణుగోపాల్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మొదటినుంచీ తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. ‘నాపై ఆరోపణలు చేసిన మహిళ పైనే 36 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయంటే ఆమె చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంతో మీరే అర్థం చేసుకోవచ్చ’ని అన్నారు. బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు ఐదుగురు మృతి చెందడం కేవలం ప్రకృతి వైపరీత్యమే అని, ఇలాంటి సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరని వేణుగోపాల్ పేర్కొన్నారు. కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ను వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేణుగోపాల్‌ను కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జ్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ శోభా కరంద్లాజె నేతృత్వంలో బీజేపీ మహిళా మోర్చా శుక్రవారం నిరసనలు చేపట్టింది. వేణుగోపాల్ పలువురు మహిళలను వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రానికి పంపడాన్ని వ్యతికరేకిస్తున్నామని ఈ సందర్భంగా శోభా కరంద్లాజె అన్నారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి రాకుండా చూడాలని సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ సీనియర్ నేతలు కేజే జార్జ్, దినేశ్ గుండురావులను కోరారు. వేణుగోపాల్ తమ రాష్ట్రానికి వస్తే నల్లజెండాలతో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కాగా, తనను రేపిస్ట్‌గా పేర్కొన్న శోభా కరంద్లాజెపై పరువునష్టం దావా వేసినట్టు వేణుగోపాల్ తెలిపారు.