సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే వ్యాఖ్యలపై నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఆక్రోశం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేతుల గాజులు వేసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఖండిస్తూనే గాజులను పంపితే తాము వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన నిన్న కుందగోళలో విలేకర్లతో మాట్లాడారు. కుందగోళను దత్తతకు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు ఆశించిన దానికంటే అధికంగా అభివృద్ధి చేస్తామన్నారు. శోభా చేసిన గాజుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శోభక్క ఎప్పుడు పంపుతుందోనని తాను ఎదురు చూస్తున్నాన్నారు. సిద్ధరామయ్య రేవణ్ణపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
23 తర్వాత ‘సంకీర్ణం’ పతనం
రాష్ట్రంలో ప్రభుత్వం బదిలీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. లోక్‌సభ ఫలితాల అనంతరం కర్ణాటకలోని కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. గురువారం ఆయన హుబ్బళి విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య సమన్వయ లోపమే సంకీర్ణ ప్రభుత్వానికి కారణం అవుతుందని చెప్పారు. గత 2018 విధానసభ ఎన్నికల్లో 104 స్థానాలు సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా.. కేవలం 37 సీట్లు సాధించిన జేడీఎస్ సీఎం కుర్చీ ఎక్కడం ఏంటని ప్రశ్నించారు.
అలాగే రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పీఠంపై ఉండటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అన్నారు. కాంగ్రెస్‌కు నైతిక విలువలు లేవని మండిపడ్డారు. కాగా బీజేపీకి ప్రస్తుతం ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి 106 మంది సభ్యుల బలం ఉందన్నారు. ప్రస్తుతం చించోళి, కుందగోళలో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని.. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 108కు చేరుతుందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఫలితంగా 23వ తేదీ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం పతనం దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్ని విలేకరుల ప్రశ్నకు బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. తమకు సంపూర్ణ బలం ఉన్ననాడే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఏ పార్టీతోనూ కుమ్మక్కయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మారడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment