అధికార కాంగ్రెస్‌లో లుకలుకలు
ఢిల్లీలో ముమ్మరంగా ప్రయత్నాలు
సీఎం సిద్దరామయ్యకు తలనొప్పి
ముఖ్యమంత్రి పదవి కోసం హస్తంలో మంత్రులు, సీనియర్లలో ఎక్కడా లేని ఆశ పుట్టుకొచ్చింది. సీఎం సిద్దరామయ్య ముడా స్థలాల కేసులో చిక్కుకోవడం, ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఓకే అనడంతో డోలాయమానంలో ఉన్నారు. దీంతో సమీకరణాలు మారవచ్చనే అంచనాలున్నాయి. ఇదే అదనుగా సీఎం కుర్చీకి తమకంటే అర్హులు ఎవరూ లేరంటూ అనేకమంది మంత్రులు ఘంటాపథంగా చాటుకోవడంతో పాటు హస్తిన యాత్రలు చేస్తున్నారు. ఓ రకంగా పీఠం కోసం కుస్తీకి తెరలేచింది.
సాక్షి, బెంగళూరు: ఆలు లేదు, చూలు లేదు.. అన్నట్లు ముఖ్యమంత్రి కుర్చీ ఇంకా ఖాళీ కాలేదు.. అప్పుడే తానే సీఎంఅంటూ ఒక్కొక్కరూ ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న నాయకులు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇలా అధికార కాంగ్రెస్‌ను సీఎం కుర్చీ జ్వరం ఆవహించింది. ఇందుకోసం తెరవెనుక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పలువురు నేతలు బహిరంగంగా పదవి కోసం ప్రకటనలు చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పాటిల్‌ల గొడవ
మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద పాటిల్ మధ్య ముఖ్యమంత్రి స్థానం కోసం బహిరంగ వాగ్వాదం చోటు చేసుకుంది. తొలి నుంచి శివానంద పాటిల్ కాంగ్రెస్ పార్టీలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బంది కలుగజేస్తున్నారనే పేరుంది. 2023 ఎన్నికలకు ముందు తనకు ఎలాంటి హైకమాండ్ లేదని, తానే అధినాయకత్వం అని శివానంద పాటిల్ హంగామా చేశారు. ఎన్నికల తర్వాత మంత్రిమండలిలో ఈ ఇద్దరు నేతలకు పదవి కల్పించక తప్పని పరిస్థితి సిద్ధరామయ్యకు ఏర్పడింది. ఇప్పుడు సీఎం పదవిపై ఇద్దరూ కన్నేశారు.
డీకేశి, ఇతర మంత్రులు..
ఇక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆ పదవి కోసం ఆది నుంచి గట్టి పోటీలో ఉన్నారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత తానే సీఎం అని ఖరారు చేసుకున్నారు. మారిన పరిస్థితుల్లో తరచూ ఢిల్లీలో, రాహుల్‌గాంధీతో మాట్లాడుతూనే ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా మంత్రులు జమీర్ అహ్మద్, ఆర్‌వీ దేశ్‌పాండే తదితర సీనియర్లు తామేం తక్కువ కాదని, అదృష్టం వరిస్తే సీఎం కుర్చీ లభిస్తుందని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాల వల్ల పరిపాలనలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు విమర్శలున్నాయి.
నాకూ సీఎం కావాలని ఉంది
మంత్రి ఎం.బీ పాటిల్
సాక్షి,బళ్లారి: సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉందని మంత్రి ఎం.బీ పాటిల్ అన్నారు. విజయపురలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవకాశం లభిస్తే మంచి పనులు చేయాలని ఉందని, భగవంతుని ఆశీస్సులు ఉంటే కచ్చితంగా పదవి వరిస్తుందన్నారు. డీకే శివకుమార్, పరమేశ్వర్ సమకాలికులమని, రేసులో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు.
ఢిల్లీకి వెళ్లకూడదా?
సీఎం మార్పు జరగవచ్చనే సంకేతాలు వస్తున్న తరుణంలో 2–3 సార్లు మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీలో హైకమాడ్‌ను కలుసుకుని తన పేరును కూడా పరిశీలించాలని మనవి చేశారు. హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఢిల్లీకి వెళ్లారు. మాకు ఎన్నో పనులుంటాయి, వెళ్లకూడదా? అని మీడియా ముందు చెప్పారు. దీనిని బట్టి సీఎం రేసులో తానూ ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మంత్రులు లోలోపల విందు సమావేశాలు సాగిస్తూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ౖపైపెకి అంతా సవ్యంగా సాగుతోందని అనిపిస్తున్నప్పటికీ లోలోపల పదవీ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment