బనశంకరి: అధికార హస్తం పార్టీలో తరచూ ఏదో ఒక వివాదం పుట్టుకొస్తోంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని మాగడి కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌సీ.బాలకృష్ణ డిమాండ్ చేయడం, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధిక సీట్లు గెలిస్తే సీఎం సిద్దరామయ్యే పూర్తికాలం సీఎంగా ఉంటారని ఆయన కుమారుడు యతీంద్ర ప్రకటించడంతో అధికార పార్టీలో వేడి రగుల్కొంది. ఇది ప్రతిపక్షాలకు కూడా విమర్శలకు అవకాశమిచ్చింది. సీఎం పదవిని తలా రెండున్నరేళ్లు పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్లు సర్కారు ఏర్పాటు సమయంలో జోరుగా ప్రచారం సాగింది. కానీ సీఎం, డీసీఎంల అనుచర ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు విరుద్ధమైన ప్రకటనలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
హైకమాండ్ పదే పదే చెప్పినా..
సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఎవరూ చర్చించరాదని, గ్యారంటీ పథకాల అమలు, లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా హైకమాండ్ పెద్దలు పదేపదే హెచ్చరికలు జారీచేస్తున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు నోటికి పనిచెబుతూనే ఉన్నారు. మంగళవారం యతీంద్ర చేసిన ప్రకటన మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది. ఆయన ప్రకటనపై మంత్రులు, సీనియర్ నేతలు దూరంగా ఉన్నారు. యతీంద్రవి వ్యక్తిగత వ్యాఖ్యలని, దీనికి పార్టీకి సంబంధం లేదని చాలామంది తప్పించుకున్నారు. కానీ బీజేపీ నేతలు హస్తంలో లుకలుకలు తీవ్రమైనట్లు ఆరోపణలు గుప్పించారు.
డీకేశిని చూస్తే జాలేస్తోంది: సింహా
మైసూరు: సీఎం కుర్చీలో పూర్తికాలం పాటు కొనసాగాలని సీఎం సిద్ధరామయ్య పథకమేశారని, డిప్యూటీ సీఎం డీకేశిని చూస్తే పాపమనిపిస్తోందని ఎంపీ ప్రతాప సింహా ఎద్దేవా చేశారు. బుధవారం మైసూరులో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికసీట్లు గెలిస్తే మా నాన్న పూర్తి కాలం సీఎంగా ఉంటారని యతీంద్ర చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తరువాత సీఎం కావాలని కలలు కంటున్న డీకే శివకుమార్‌ను ఇప్పుడు తలుచుకుంటే జాలి వేస్తోందని వ్యంగ్యమాడారు. డీకే సీఎం అవుతారని ఆయన వర్గీయులు ఓట్లు వేశారని, అయితే వారందరికీ మోసం జరిగిందని అన్నారు. సిద్ధరామయ్య అందరి మధ్య గొడవలు పెట్టి పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని విమర్శించారు. కోలారులో రాముని ఫ్లెక్సీని దుండగులు చింపేయడంపై ఎంపీ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలో రామునికి గౌరవం దక్కదని ఆరోపించారు.
యతీంద్ర పదవీ బాధ్యత లేని నేత, తమ నాయకునికి శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పుపట్టే పని లేదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అన్నారు. మా నాన్న ఐదేళ్లూ సీఎం ఉండాలనేలా యతీంద్ర మాట్లాడడాన్ని బుధవారం కుమారకృప వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా డీకే మాట్లాడారు. తమ ప్రభుత్వం కొనసాగుతుందని, సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అన్నారు. సిద్దరామయ్య సీఎంగా, నేను కేపీసీసీ అధ్యక్షునిగా ఇద్దరూ కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. అందులో ఎలాంటి అనుమానం లేదని, ఆశపడటం, శక్తి ఇవ్వాలని ప్రజలను అడగడంలో తప్పులేదు, నేను కూడా మా ప్రజలను ఇలాగే అడుగుతానంటూ వివాదాన్ని సద్దుమణిగేలా మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment