బనశంకరి/ శివాజీనగర: గత పదిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.90 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, రాబోయే లోకసభ ఎన్నికల నేపథ్యంలో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడానికి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఐటీ దాడులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదట 4వ తేదీన 30 చోట్లకు పైగా తనిఖీలు చేశారు. అందులో బంగారు వ్యాపారులు, మెడికల్ దుకాణాలు, ఆసుపత్రి యజమానులు, అకౌంటెంట్లతో పాటు బెంగళూరులో భారీ ధనవంతులు ఉన్నారు.
12వ తేదీన కాఫీ బోర్డు డైరెక్టర్, బంగారు దుకాణం యజమానుల ఇళ్లలో, అంగళ్లలో దాడులు జరిగాయి. 13వ తేదీన కాంట్రాక్టర్ల సంఘం ఉపాధ్యక్షుడు ఆర్.అంబికాపతి నివాసంలో సోదాల్లో రూ.42 కోట్లు దొరికాయి. 14వ తేదీ బిల్డర్ సంతోష్ కృష్ణప్ప ఫ్లాట్‌లో రూ.40 కోట్ల నగదు లభించింది. దీంతో ఇప్పటికి స్వాధీనమైన నగదు రూ.90 కోట్లను దాటింది. మంగళవారం విచారణకు వచ్చి నగదు వివరాలు చెప్పాలని కాంట్రాక్టర్ అంబికాపతి, భార్య అశ్వత్దమ్మ, కుమారులు ప్రదీప్, ప్రతాప్ లకు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది.
కంగారులో కాంగ్రెస్, రహస్య భేటీ
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని.. డిప్యూటీ డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ బెంగళూరులో సోమవారం భేటీ చేసి ప్రాముఖ్యమైన చర్చలు జరిపారు. వేణుగోపాల్ ఆకస్మికంగా నగరానికి వచ్చారు. ఆదివారం మైసూరు దసరా వేడుకల్లో పాల్గొన్న డీకేశి కూడా త్వరగా రాజధానికి వచ్చేశారు. ఇద్దరూ కలిసి ఖర్గేని ఆయన నివాసంలో కలవడం రాజకీయాల్లో పెను కుతూహలానికి కారణమైంది.
ఐటీ దాడుల్లో లభిస్తున్న నగదు అధికార కాంగ్రెస్ నాయకులదేనని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నేతలు దాడి ప్రారంభించారు. దీనిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయమై ముగ్గురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నాయకుల్లో అసంతృప్తిని తగ్గించడానికి పదవులు పంపకాలను చేపట్టాలని, బోర్డులు, కార్పొరేషన్‌ల నియమకాల గురించి ప్రస్తావనకు వచ్చింది.
ఈ పదవుల్లో పార్టీ ఎమ్మెల్యేలకు సగం ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. సీఎం సిద్దరామయ్య మైసూరు దసరా సంబరాల్లో ఉండడంతో ఆయన భేటీలో పాల్గొనలేదు. అలాగే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట అభ్యర్థుల గురించి కూడా ఖర్గే, కేసీ, డీకే చర్చించారని సమాచారం. త్వరలోనే బోర్డు, కార్పొరేషన్‌లకు అధ్యక్షుల నియామకం జరగవచ్చు. భేటీ తరువాత కేసీ, డీకే దానిపై మీడియాతో మాట్లాడాకుండా వెళ్లిపోయారు.
ఆ డబ్బుతో కాంగ్రెస్‌కు ఏం సంబంధం: సీఎం
మైసూరు: మా ప్రభుత్వంపైన బీజేపీ నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణలు రాజకీయమైనవే తప్ప అందులో ఎలాంటి నిజం లేదు, ఇది రాజకీయం కుట్రలో భాగమని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఇళ్లలో కోట్ల రూపాయలు దొరికితే అది కాంగ్రెస్‌కు చెందినదని, ఇది పంచ రాష్ట్రాల ఎన్నికల కోసం సేకరించిందని బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ డబ్బుతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారని, త్వరలోని అన్నీ బయటికి వస్తాయని చెప్పారు.
సీబీఐ విచారణకివ్వాలి: యడ్డి
యశవంతపుర: బెంగళూరులోని కొందరు కాంట్రాక్టర్ల ఇళ్లల్లో కోట్లాది రూపాయల నగదు లభించిన కేసును సీబీఐ, ఈడీ విచారణకు అప్పగించాలని బీజేపీ మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో మాట్లాడుతూ ఆ విచారణ ద్వారానే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. ఈ సొమ్ముల మూలం కనిపెట్టేందుకు తనిఖీ అవసరమన్నారు. కాగా రాష్ట్రంలో విద్యుత్ కోతతో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతల వల్ల పంటలకు నీరివ్వలేక ఎండిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే బోర్లకు, పంపుసెట్లకు విద్యుత్ ఇవ్వాలన్నారు. గ్యారంటీల పేర్లతో ప్రజలను మోసం చేస్తోందన్నారు.
ఇంట్లో దండిగా డబ్బు ఉంటే యజమానికి సంతోషం. కానీ ఇప్పుడు అదే డబ్బును ఎక్కడ దాచుకోవాలో తెలియక ఐటీ సిటీ ధనవంతులు మథన పడుతున్నారు. ఏ క్షణంలో ఐటీ అధికారులు దూసుకొచ్చి నగదు పట్టుకెళతారోనన్న దిగులే ఇందుకు కారణం. కొన్నిరోజులుగా కన్నడనాట ఐటీ శాఖ జోరు మీదుంది. బెంగళూరులో ఇద్దరు బడా కాంట్రాక్టర్ల ఇళ్లలో కళ్లు చెదిరే మొత్తంలో డబ్బులు దొరికాయి. మరికొందరి ఇళ్లలో ఓ మోస్తరుగా లభించింది. చివరకు ఇది అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య యుద్ధంగా మారింది. ఆ డబ్బు మీదేనని పాలకులపై విపక్షాలు వేలు చూపిస్తుంటే, మాకు సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment