మంత్రులు లక్ష్మీ హెబ్బాళ్కర్, సతీశ్ జార్కిహోళి
బనశంకరి: గత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన బెళగావి పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ పదవిని తమ వర్గీయులకు కట్టబెట్టాలని మహిళా శిశుసంక్షేమశాఖామంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్, మరో వైపు ప్రజాపనులశాఖమంత్రి సతీశ్‌జార్కిహోళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో మంత్రుల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. సంకీర్ణ సర్కార్ హయాంలో తమవర్గానికి చెందిన నేతకు పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అప్పట్లో బెళగావి గ్రామాంతర ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మీహెబ్బాల్కర్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్‌జార్కిహొళి పట్టుబట్టారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న డీకే.శివకుమార్ లక్ష్మీ హెబ్బాల్కర్‌కు మద్దతుగా నిలవగా రమేశ్‌జార్కిహొళికి సోదరుడు, మంత్రిగా ఉన్న సతీశ్‌జార్కిహొళి మద్దతు ఇచ్చారు.
సోదరుల సవాల్‌కు ఎదురొడ్డి నిలబడిన లక్ష్మీహెబ్బాల్కర్ చివరికి వారిపై పైచేయి సాధించి తమ మద్దతుదారుడికి పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్ష పదవి దక్కేలా చూశారు. ఈ వివాదం రాజీద్వారా పరిష్కారమైనట్లు కనబడినప్పటికీ లక్ష్మీహెబ్బాళ్కర్– రమేశ్‌జార్కిహొళి బ్రదర్స్ మధ్య వర్గపోరు అలాగే కొనసాగి ఆపరేషన్ కమలకు దారితీసి సంకీర్ణప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది. అనంతరం మూడన్నరేళ్ల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాదిజరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
కానీ పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్ష పదవి విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య పోరు మొదలైంది. పైకి ఇద్దరు మంత్రులు కలిసిపనిచేస్తున్నట్లు కనబడినా అధికారుల బదిలీలు, స్థానికంగా పార్టీ కార్యకలాపాల్లో వైరుధ్యం అలాగే ఉంది. లక్ష్మీహెబ్బాల్కర్‌కు డిప్యూటీసీఎం డీకే.శివకుమార్ లాశీస్సులు ఉండటంతో జార్కిహొళి కుటుంబానికి తలనొప్పిగా మారింది. మంత్రి వర్గ కూర్పులో కూడా మహిళా ఎమ్మెల్యేలు అందరిని వెనక్కి నెట్టి లక్ష్మీహెబ్బాల్కర్ మంత్రివర్గంలో స్ధానం దక్కించుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతవ్యక్తుల సహకారం ఉండటంతో లక్ష్మీహెబ్బాల్కర్ పీఎల్‌డీ బ్యాంకుపై పట్టుసాధించాలని భీష్మించుకున్నారు. దీనిపై బహిరంగంగా మాట్లాడలేక రగిలిపోతున్న సతీశ్‌జార్కిహొళి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను విహారయాత్రకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ–జేడీఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్‌లో విభేదాలు కొంపముంచే అవకాశం ఉంది. ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య తన ఆప్తుల ద్వారా రాజీప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో బయటివారి జోక్యం తగ్గకపోతే రానున్న రోజుల్లో తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment