
గుల్బర్గా: కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప విలేకరుల సమావేశంలో సహనం కోల్పోయి.. ఓ విలేకరిపై చిందులు తొక్కారు. గత ఐదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరుపై ఓ విలేకరి పలుమార్లు ప్రశ్నించడంతో ఆయనపై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గుల్బర్గాలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. గడిచిన ఐదేళ్లలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చిందని యడ్యూరప్పను ప్రశ్నించారు. దీంతో భవిష్యత్తులో అన్ని హామీలు నెరవేరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అయినా, విలేకరి మళ్లీ అదే ప్రశ్న అడుగడంతో యడ్యూరప్పకు కోపం వచ్చింది.
‘విను.. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో హామీలు నెరవేరుస్తాం. మేం అన్ని హామీలు నెరవేర్చామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఐదేళ్లలో హామీలు అమలుచేస్తామని నేను చెప్పలేదు. నేను చెప్పానా?.. ఎందుకు చేయలేదని నువ్వు అడిగితే.. ఏం చెప్తాం. భవిష్యత్తులో చేస్తాం. కేవలం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతిదీ చేయలేం. కొన్ని పరిమితులు ఉంటాయి. దయచేసి.. వాదించకు. ప్రతిదీ చేశామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. దేశమంతటా చేయాల్సిన పని మొదలైంది. ఇక్కడ కూడా చేసేందుకు మేం ప్రయత్నిస్తాం. మేం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని యడ్యూరప్ప ఆగ్రహంగా చెప్పుకొచ్చారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని, మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని, ఎంపీలను తాను కోరతానని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment