
బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే
ఇప్పటికే టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలను జరిపి విమర్శలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య సర్కారు తాజాగా బహుమని సుల్తాన్ జయంతిని జరపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సాక్షి, బెంగళూరు: ఇప్పటికే టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలను జరిపి విమర్శలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య సర్కారు తాజాగా బహుమని సుల్తాన్ జయంతిని జరపాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జయంతిని నిర్వహిస్తే ఊరుకోబోమని బీజేపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఇదే విషయమై బెంగళూరులో బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేసి వేలమంది హిందువులను క్రూరంగా హత్య చేసిన బమమని సుల్తాన్ జయంతిని నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోసారి రాష్ట్రంలో మతఘర్షణలను రెచ్చగొట్టడానికి సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతామని చెప్పారు. కలబురిగిలోని బహుమని సుల్తాన్ కోటలో జయంతి వేడుకలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
ఆ వార్తలు అవాస్తవం: సీఎం సిద్ధు
బహుమని సుల్తాన్ జయంతి వార్తలు అవాస్తవమని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ అసలు బహుమని సుల్తాన్ ఎవరో కూడా తమకు తెలియదని, అటువంటి పరిస్థితుల్లో ఆ జయంత్యుత్సవాలున నిర్వహించే అవకాశమే లేదన్నారు. మంత్రి శరణప్రకాశ్ పాటిల్ చేసిన వాఖ్యలపై స్పందిస్తూ ఆ సంగతి నాకు తెలియదు, మంత్రినే అడగాలని సూచించారు.