సమావేశంలో మాట్లాడుతున్న హేమలత
సంగారెడ్డి జోన్: దేశంలో మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 5న జరిగే ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ హేమలత అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని బాలాజీ మంజీరా గార్డెన్స్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ‘ప్రత్యామ్నాయ ఆర్థిక రాజకీయ విధానాలు– కార్మికవర్గం పాత్ర’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు, కూలీలు, రైతులందరితో లక్షలాది మంది కలిసి దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలియజేస్తామని, మోదీ పాలన లో అచ్చేదిన్‌లన్ని , కార్పొరేట్, పెట్టుబడిదార్లకే వచ్చాయన్నారు. కార్మికుల ఐక్యతను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందన్నారు. ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కేంద్రం కొత్త సవరణను ముందుకు తెచ్చి కార్మికులకు , ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందని ఆరోపించారు.
ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేసిందని, ఇన్సూరెన్స్ , బ్యాంకింగ్, రైల్వే, రక్షణ, ఫార్మా రంగాలను పూర్తిగా బలహీనం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనం, పనిహక్కు సామాజిక భద్రత కోసం అమలవుతున్న బెనిíపిట్స్ స్థానంలో బీమా ఆధారిత విధానాన్ని తెచ్చిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక చట్టాలను సవరించి అమలు చేస్తూ ఆ విధానాలనే దేశ వ్యాప్తంగా చేయడం కోసం ప్రయత్నిస్తుందన్నారు.
అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు కె.రాజయ్య , బి. మల్లేశంలు మాట్లాడుతూ మన బతుకులు బాగు చేసే విధంగా ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని, అందుకు పాలకులు సహకరించకపోతే నేటి పాలకులనే మార్చుకోవాలన్నారు. మన కోసం పని చేసే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను బలపర్చాలని కార్మికవర్గానికి పిలుపునిచ్చారు.
సామాజిక న్యాయం– సమగ్రాభివృద్ధి అనే ఏజెండాను నిజమైన అర్థంలో అమలు చేసేందుకు తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాజకీయ వేదిక ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బాగారెడ్డి, నాయకులు ఎస్.మహిపాల్, పి.మంగ, జయరాజు, యాదగిరి, స్వాతి, నాగేశ్వర్‌రావు, మొగులయ్య, బాలరాజు, పెంటయ్య, మౌలాలీ, వెంకటరాజం, యాదయ్య, శ్రీధర్, నాగభూషణం అరుణ, వీరమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment