సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మే 12వ తేదీన జరుగనున్న ఆరో విడత ఎన్నికలకు ఈ రోజు సాయంత్రం ప్రచారం ముగిసింది. పలుసార్లు రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు పరస్పరం పరుష పదజాలంతో దూషించుకున్నారు. విమర్శించుకున్నారు. మధ్యలో తొందరపడిన మీడియా మమతా బెనర్జీ మాటలను వక్రీకరించింది.
ప్రధాని నరేంద్ర మోదీని ‘చెంప మీద కొడతానని... చెంప మీద కొట్టినట్లు ఫీలవుతున్నాను’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్లు ఆజ్‌తక్, ఏబీపీ హిందీ చానళ్లు వార్తా కథనాలను ప్రసారం చేయడమే కాకుండా చర్చా గోష్ఠులు కూడా నిర్వహించాయి. మోదీని చెంప మీద కొడతానని మమతా బెనర్జీ బెదిరించినట్లు ‘సీఎన్‌ఎన్18’ ఛానెల్ వార్తను ప్రసారం చేసింది. ఆ తర్వాత మమత అధికారిక వివరణతో ఆ వార్తను తొలగించింది. మోదీ ఇటీవల బెంగాల్‌లో పర్యటించినప్పుడు తృణమూల్ పార్టీని త్రిబుల్ టీ అని, అంటే ‘తృణమూల్ తోలబాజీ టాక్స్’ అని విమర్శించారు. తోలబాజీ అంటే బెంగాల్‌లో దౌర్జన్యంగా డబ్బులు లాక్కోవడం. దానికి స్పందించిన మమతా, ‘ప్రజాస్వామ్యం చెంపపెట్టు ఎలా ఉంటుందో మోదీకి రుచి చూపించాలనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. ఆమె ప్రసంగం అన్ని వీడియోల్లో ప్రజాస్వామ్యం చెంపపెట్టు అనే మాట స్పష్టంగా ఉంది. టీఆర్పీ రేట్ల కోసం వెంపర్లాడే టీవీ ఛానెళ్లు ఉద్దేశపూర్వకంగానే ప్రజాస్వామ్యం మాటను తొలగించాయో, పొరపాటు పడ్డాయో వాటికే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment