డిగ్గీ రాజా ఈజ్‌ బ్యాక్‌ | Digvijaya Singh Contest in Bhopal | Sakshi
Sakshi News home page

డిగ్గీ రాజా ఈజ్‌ బ్యాక్‌

Published Thu, Mar 28 2019 11:21 AM | Last Updated on Thu, Mar 28 2019 11:21 AM

Digvijaya Singh Contest in Bhopal - Sakshi

మధ్యప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ.. భారతీయ జనతా పార్టీకి కంచుకోటలైన స్థానాల్లో పాగా వేయాలని వ్యూహాలను పన్నుతోంది. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ను భోపాల్‌ బరిలోంచి దింపుతోంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో, నాయకుల్లో వర్గాలకు అతీతంగా అందరితోనూ సత్సంబంధాలున్న ఒకే ఒక్క నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌. 30 సంవత్సరాలుగా భోపాల్, ఇండోర్, విదిష, దామో నియోజకవర్గాలు బీజేపీకి కంచుకోటగా ఉన్నాయి. అలాంటి స్థానాల్లో గట్టి అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ప్రతిపాదనల మేరకే దిగ్విజయ్‌ సింగ్‌ పోటీకి అంగీకరించారు. వాస్తవానికి ఆయన రాజ్‌గఢ్‌ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ భోపాల్‌ వంటి చోట దిగితేనే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చన్న కమలనాథ్‌ సూచనకు సరేనన్నారు.

వివాదాలకు మారుపేరు
కాంగ్రెస్‌ శ్రేణులు ‘డిగ్గీ రాజా’గా పిలుచుకునే దిగ్విజయ్‌సింగ్‌.. వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలో ఆయన చేసిన ఎన్నో వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. 2003 ఎన్నికల్లో ఓడిపోతే పదేళ్ల పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. చివరకు ఆ మాట మీదే నిలబడ్డారు. 2003లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలయ్యాక తెరవెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయననే లోక్‌సభ బరిలోకి దింపడం ద్వారా పార్టీలో వర్గపోరును కొంతైనా తగ్గించవచ్చన్న వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం మూడు మాత్రమే. చింద్వారా, గుణ, రత్లాం లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్‌ చేతిలో ఉన్నాయి. అందుకే ఈసారి అభ్యర్థుల ఎంపికలో గట్టి కసరత్తే చేస్తోంది. అంతర్గతంగా సర్వే చేయించి మరీ అభ్యర్థుల్ని పోటీకి దింపుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రత్లాం స్థానాన్ని కోల్పోయింది. పీసీసీ మాజీ చీఫ్‌ కాంతిలాల్‌ భూరియా ఆ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

సింధియాను గ్వాలియర్‌కు పంపుతారా?
జ్యోతిరాధిత్య సింధియా ప్రస్తుతం గుణ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అక్కడ సింధియాకు వ్యతిరేకంగా అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనను గ్వాలియర్‌ బరిలో దింపే యోచనలో అధిష్టానం ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న జైఆదివాసీ యువ సంఘటన్‌ (జయాస్‌) నాలుగు గిరిజన స్థానాలను కావాలని పట్టుబడుతోంది. అందులో రత్లాం కూడా ఉంది. కాంగ్రెస్‌ ఆ పార్టీకి రెండుకి మించి సీట్లు కేటాయించే అవకాశాల్లేవు. అదే జరిగితే రత్లాం బరిలో మళ్లీ భూరియానే దింపుతారు. ఇక ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత తొమ్మిదిసార్లుగా ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తన సీఎం సీటులో కొనసాగాలంటే అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఆయన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చింద్వారా నుంచే పోటీ చేస్తున్నారు. అందుకే కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్‌ను చింద్వారా లోక్‌సభ బరిలో కాంగ్రెస్‌ అధిష్టానం దింపనుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌సింగ్‌ కుమారుడు అజయ్‌ సింగ్‌ గత ఎన్నికల్లో సాత్నా నియోజకవర్గం నుంచి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు అజయ్‌ను సిధి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నారు.

కుమ్ములాటలు కొలిక్కి?
అంతర్గత కుమ్ములాటలతోనే మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరమైంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దిగ్విజయ్‌సింగ్‌ స్వయంగా రాష్ట్రమంతటా తిరిగి పార్టీలో ముఠా తగాదాలను తీర్చి అందరినీ కలిపే ప్రయత్నం చేశారు. 2017 సెప్టెంబర్‌ 30 నుంచి ఆరు నెలల పాటు నర్మద యాత్ర నిర్వహించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత మతపరమైన యాత్రగా ప్రకటించిన ఆయన నర్మద తీర ప్రాంతంలోని 90 నియోజకవర్గాలను చుట్టారు. దిగ్విజయ్‌ సింగ్‌కు బీజేపీలో ఉన్న సన్నిహితులు కూడా ఈ యాత్రను హర్షించి ఆయనకు స్వాగత సత్కారాలు చేయడం విశేషం.


డేట్‌లైన్‌–భోపాల్‌ సౌమ్య నాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement