సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో గురువారం నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించారు. పైన నలుపు, మధ్యలో తెలుపు, కిందిభాగంలో ఎరుపు, మధ్యలో జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఏఐఏడీఎంకే పార్టీని ద్రోహుల నుంచి తిరిగి దక్కించుకునేందుకు పోరాడుతామని సీఎం, డెప్యూటీ సీఎంలను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇది రాజకీయ పార్టీ కాదు, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనన్నారు.
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కేటాయించిన కుక్కర్ గుర్తునే పార్టీ చిహ్నంగా ఖరారు చేసుకున్నామన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి ఏఐఏడీఎంకే నుంచి బహిష్కృతులైన 18 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment