సాక్షి, మైదుకూరు : ‘‘సాధారణంగా గ్రామాల్లో మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు మనుషులు కలిస్తే... నువ్వు నేను కలిస్తే...మనం అంటాం. అలాగే మనం... మనం కలిస్తే.... జనం అంటారు. ఇలాంటి జనం అంతా రాష్ట్రంలో కలిస్తే జగన్’’ అని వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైదుకూరు బహిరంగ సభలో మాట్లాడుతూ... నువ్వు నేను కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జనం జనం కలిస్తే వైఎస్ జగన్. నా ప్రియ మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. జరగబోయే ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మల్యే అభ్యర్థి రఘురామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలి.
రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఎన్నో అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుని, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల్లో తమ వారికే న్యాయం చేసుకున్నారు. మీ ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పండి. జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన అవసరం మనకుంది. జగన్ సభలకు విపరీతంగా జనాలు వస్తున్నారు. అలాగే అన్ని నియోజకవర్గాల ప్రజలు తమ ప్రేమ, అభిమానాలను ...బ్యాలెట్ రూపంలో చూపించాలి. ఈ సందర‍్భంగా మీకు ఓ విషయం చెప్పాలి. ఈ నెల 26న ఇంగ్లీష్ దిన పత్రిక ‘ఎకనమిక్స్ టైమ్స్’ చంద్రబాబు నాయుడు విధానాలు...రాబోయే ఎన్నికల్లో పరాజయం తప్పదంటూ ఓ కథనం ప్రచురించింది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో... అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబుకు పరాజయం అని రాసింది’ అని డీఎల్ రవీంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment