సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన కులాలకు (ఈబీసీ) కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను రెండు వర్గాలుగా విభజించి కాపులకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు తెచ్చిన బిల్లును శాసనమండలి శుక్రవారం ఆమోదించింది. ఎటువంటి చర్చ లేకుండానే బిల్లును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం హడావుడిగా ఆమోదించడం విమర్శలకు దారితీసింది. బిల్లుపై సమగ్రంగా చర్చిచాలని బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లతో పాటు పీడీఎఫ్ సభ్యులు పట్టుబట్టినా డిప్యూటీ చైర్మన్ వినిపించుకోలేదు. ఆయన వైఖరిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ జరగకుండా బిల్లును ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ బీజేపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు.
గందరగోళం నడుమ ఆరు బిల్లులను శాసనమండలి ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లులను శాసనసభ గురువారం ఆమోదించిన సంగతి తెలిసిందే. కీలకమైన బీసీ సబ్‌ప్లాన్ బిల్లుపై కనీస కసరత్తు చేయకుండా టీడీపీ సర్కారు మొక్కుబడిగా నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి.
చర్చ జరగకుండా ఆమోదమా?
అప్పటికప్పుడు బిల్లులు అందించి, చర్చ జరగకుండానే వెంటనే ఆమోదించడం మంచి సంప్రదాయం కాదని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు. శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ జరిగి ఉంటే ఎన్నో విషయాలు చర్చించేవాళ్ళమని చెప్పారు. శాసనమండలిలో అర్ధవంతమైన చర్చ జరగలేదని మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. (బీసీలపై మరో వంచన వల!)
Comments
Please login to add a commentAdd a comment