సాక్షి,న్యూఢిల్లీ: చుట్టూ చీకటి..దారంతా ముళ్లు..అయినా ఆశలన్నీ ఆ నేతపైనే..భారమంతా అధినేత భుజాలపైనే. ముంచుకొచ్చిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అటు తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే మోదీ బ్రాండ్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే బీజేపీకి కీలకమైన మోదీ ఇమేజ్ మసకబారుతుండటమే ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలకు కునుకులేకుండా చేస్తోంది. మూడున్నరేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీపై తొలిసారిగా స్వయంగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపించడం, ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ఉద్యోగాలు 12 ఏళ్ల కనిష్టస్థాయికి పతనమవడం ఎంతటి ప్రజాదరణ కలిగిన నేతకైనా ఆందోళన కలిగించే పరిణామాలే.నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలతో ఆర్థిక వృద్థి దిగజారడం మోదీపై విమర్శలు గుప్పించేందుకు విపక్షాలకు అందివచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో సొంత పార్టీలోనే యశ్వంత్ సిన్హా వంటి సీనియర్లు మోదీని టార్గెట్ చేయడం కమలనాథుల్లో కలవరం కలిగిస్తోంది. ఆర్థిక వ్యవస్థ గాడితప్పడంపై ప్రధాని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు దిద్దుబాటుకు దిగడం నష్టనివారణ చర్యల్లో భాగంగానే భావించాలని బెంగుళూర్‌కు చెందిన జైన్ వర్సిటీ ప్రో వైస్ ఛాన్స్‌లర్, రాజకీయ విశ్లేషకులు సందీప్ శాస్ర్తి వ్యాఖ్యానించారు.
మాటల యుద్ధం
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా ఇప్పుడు ఆర్థికాంశాలపైన విమర్శలూ రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను మోదీ నడిపిస్తున్న తీరుపై వాజ్‌పేయి హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన యశ్వంత్ సిన్హా నిప్పులు చెరగడం కలకలం రేపింది. పార్టీలో ఇదే అభిప్రాయంతో ఎంతో మంది ఉన్నారని, కానీ వారు భయంతో తనలా మాట్లాడలేకపోతున్నారని సిన్హా కుండబద్దలు కొట్టారు. సిన్హా వ్యాఖ్యలను పార్టీ నేత శత్రుజ్ఞ సిన్హా సమర్థించారు. ఆర్థిక వ్యవస్థను సిన్హా వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక వాజ్‌పేయి కేబినెట్‌లోనే మంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరీ సైతం నోట్ల రద్దును ఆత్మహత్యాసదృశంగా అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభం దిశగా పయనిస్తున్నదని పార్టీ ఎంపీ, మాజీ హార్వార్డ్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ నేతల విమర్శలు సరేసరి. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నారని ఆ పార్టీ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.అయితే ఈ విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని యూపీఏ హయాంలో ఇంతకంటే దారుణంగా వృద్ధి రేటు పడిపోయిందని చెప్పుకొచ్చారు.
నిపుణుల మాటేంటి..?
ఆర్థిక అంశాలు రాజకీయ వేడి రగులుస్తున్న క్రమంలో మోదీ విజయ పరంపర కొనసాగడంపై నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ బలాబలాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.బలమైన విపక్షం లేకపోవడం మోదీకి కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్షణం ముందుకొచ్చిన ఆర్థిక సవాళ్లను మోదీ పరిష్కరించగలిగితే పెద్ద ప్రమాదం ఉండబోదని రచయిత, రాజకీయ విశ్లేషకులు అజయ్ బోస్ అన్నారు.అయితే మోదీ ఇమేజ్‌పై బీజేపీ భారీ ఆశలు పెట్టుకున్నా నిరుద్యోగ సమస్యను 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా దీటుగా ఎదుర్కోని పక్షంలో ఎన్‌డీఏకు విజయావకాశాలు అంత సులభం కాదని పేర్కొంటున్నారు. నోట్ల రద్దు అనంతరం యూపీ సహా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మోదీ మార్కెటింగ్ వ్యూహాల ఫలితమని యశ్వంత్ సిన్హా పేర్కొనడాన్ని చూస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కేవలం మార్కెటింగ్ మంత్రాలే పనిచేయవని, క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఎంతమేర మేలు జరిగిందనే ప్రాతిపదికన ఎన్నికల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
నిరుద్యోగులు, రైతుల సమస్యలు మరింత జటిలం కాకుండా చేయడం మోదీ ముందున్న సవాల్‌గా పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ మోదీకి దీటైన ప్రత్యామ్నాయం లేదని, అయితే ఎంతటి ప్రతిష్ట కలిగిన నేతకైనా ప్రజాగ్రహం వ్యక్తమైతే మాత్రం దానిముందు ఇమేజ్ డ్యామేజ్ అవడం అసాధ్యమేమీ కాదని అజయ్ బోస్ అన్నారు
Comments
Please login to add a commentAdd a comment