ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టయింది కర్ణాటకలో జ్యోతిష్యుల పరిస్థితి. ఎన్నికల కోడ్ తమ కొంప ముంచుతోందని లబోదిబో మంటున్నారు. అసలు విషయం ఏమిటంటే.. జ్యోతిష్యులు, హస్తసాముద్రిక నిపుణులు చేతులు చూసి జాతకాలు చెబుతారు. తమ వృత్తికి గుర్తుగా వారు తమ ఇళ్లు, కార్యాలయాల ముందు హస్తం బొమ్మలు పెట్టుకుంటారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల చిహ్నాలను ఇతరులు బహిరంగంగా ప్రదర్శించకూడదు. కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం. ఈ జ్యోతిష్యులు పెట్టుకునేది కూడా హస్తం బొమ్మనే. ఈ బొమ్మ వల్ల కాంగ్రెస్‌కు ప్రచారం చేసినట్టు అవుతుందని ఎన్నికల సంఘం ఆ బొమ్మలను తొలగించడమో, మూసేయడమో చేస్తోంది.
మాండ్య నగరంలో నాలుగు రోజుల క్రితం ఎన్నికల అధికారులు జ్యోతిష్యులు, హస్తసాముద్రికుల ఇళ్లు, ఆఫీసులన్నీ వెదికి హస్తం చిహ్నాలను తొలగించారు. ఎన్నికలయ్యేంత వరకు వాటిని బయటపెట్టవద్దని హెచ్చరించారు. హస్తం గుర్తు తమ వ్యాపార చిహ్నమని అది లేకపోతే ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాలను గుర్తించలేరని సత్యనారాయణ భట్ అనే జ్యోతిష్యుడు వాపోయారు. ‘మేం చేయి గుర్తు వాడుతాం కాని మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు అని చెప్పి దాన్నెలా తీసేస్తారు. బీజేపీ గుర్తు కమలం కాబట్టి ఎన్నికల సంఘం చెరువులు, సరస్సుల్లోని కమలాలన్నింటినీ తొలగించేస్తుందా? అని మరో జ్యోతిష్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి సూర్యుడు, ట్రాక్టర్, సైకిలు, టార్చ్‌లైటు, ఏనుగు, రెండాకులు.. ఇలా బోలెడన్ని పార్టీ చిహ్నాలున్నాయి. వాటన్నింటినీ కూడా మూసేస్తారా..సూర్యుడిని ఉదయించకుండా చేస్తారా? అంటూ జ్యోతిష్యులు ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment