ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ముహూర్తం సిద్ధమవుతోంది. ఎన్నికల తేదీల ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 10 లేదా 12 తేదీల్లో వెలువడే అవకాశం ఉందని అత్యున్నత అధికార వర్గాలు వెల్లడించాయి. అదే నెలలో నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని, నవంబర్ 15–20 తేదీల మధ్య ఎప్పుడైనా పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటానికి కొద్దిరోజుల ముందే తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుపుతామని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించినా ఎక్కువకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండటం భావ్యం కాదన్న సుప్రీంకోర్టు సలహాను అనుసరించి వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలన్న నిర్ణయానికి కమిషన్ వచ్చింది. తెలంగాణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 8న ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆ తరువాత రెండు రోజులకు అంటే అక్టోబర్ 10 లేదా 12 తేదీల్లో షెడ్యూల్ వెలువరించే ప్రయత్నంలో కమిషన్ ఉందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఒకసారి షెడ్యూల్ వెలువడితే తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. శాసనసభను ముందుగానే రద్దు చేస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఆరు నెలల సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే నవంబర్ చివరి వారం దాకా తెలంగాణకు షెడ్యూల్ ఖరారు చేయడం సాధ్యపడదు. అలాంటప్పుడు శాసనసభ రద్దయ్యాక కూడా ఆపద్ధర్మ ప్రభుత్వానికి మూడు నెలల సమయం లభిస్తుంది. అలా జరగకుండా చూసేందుకే అక్టోబర్‌లో షెడ్యూల్ వెలువరించేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించిందని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.
119 సీట్లకూ ఒకేసారి ఎన్నికలు...
అక్టోబర్ 10 లేదా 12 తేదీల్లో షెడ్యూల్ వెలువడిన పక్షంలో తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలకూ ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 15–20 తేదీల మధ్య పోలింగ్ ఉండొచ్చని ఈసీ వర్గాలు తెలియజేశాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ చివరి నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు, పోలింగ్‌కు మధ్య కనీసం 14 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ లెక్కన నవంబర్ 15–20 తేదీల మధ్య పోలింగ్ ఉండే అవకాశం ఉంది. పోలింగ్‌కు అవసరమైన ఈవీఎంలు ఇప్పటికే సిద్ధమవగా ఎన్నికల సిబ్బంది నియామకంతోపాటు వారికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం అక్టోబర్ మొదటి వారంలో పూర్తవుతుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి సమాచారం అందింది.
నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, శాంతిభద్రతలపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర హోంశాఖ ఈ నెల 20నే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేసింది. అవసరమైన బలగాలు అందుబాటులో ఉన్నాయని, తక్కువ అయితే సర్దుబాటు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఎన్నికలకు సంబంధం ఉన్న అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తి చేశామని, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ నెల 15న కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వీటన్నీటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలన్న యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికల ఫలితాలు...
తెలంగాణలో ఒకవేళ నవంబర్ మూడో వారంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయినా ఓట్ల లెక్కింపు మాత్రం ఆ నాలుగు రాష్ట్రాలతోపాటే ఉంటుందని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో వెలువడుతుందని, మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ చివరి వారంలో ముగస్తుందని చెప్పాయి. మిజోరం శాసనసభ వ్యవధి డిసెంబర్ 15వ తేదీతో ముగుస్తుందని, మిగిలిన మూడు రాష్ట్రాల శాసనసభల వ్యవధి జనవరి 6–21 మధ్య ముగుస్తుందని తెలిపాయి. ఈ కారణంగా మిజోరంలో కొన్నిరోజలు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించేందుకు మిగిలిన రాష్ట్రాల పోలింగ్ అవరోధంగా మారుతుందని ఈసీ వర్గాలు చెప్పాయి. తెలంగాణతోపాటు ఆ నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఒకేసారి డిసెంబర్ చివరి వారంలో ఉంటుందని, డిసెంబర్ 31 నాటికి మొత్తం శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోంది. అలాగే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు జనవరి నుంచే సమాయత్తం కావాలని ఈసీ యోచిస్తోంది. మార్చి చివరి వారంలో షెడ్యూల్ ప్రకటించి మే మొదటి వారానికి దేశవ్యాప్తంగా ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు వీలుగా కసరత్తు వేగవవంతం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment