న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికల యజ్ఞం ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా గురువారం 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 91 లోక్‌సభ స్థానాలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు నిర్వహించిన పోలింగ్‌లో కోట్లాది మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించాయని, ఓటర్ల పేర్లు భారీగా గల్లంతైనట్లు వార్తలు వెలువడ్డాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఓటింగ్ కొనసాగుతుండగా ఓ పోలింగ్ బూత్ సమీపంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నలుగురు నక్సలైట్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో కొందరు గుర్తింపుకార్డులు లేకుండానే పోలింగ్ కేంద్రంలోకి చొరబడటానికి ప్రయత్నించగా, బీఎస్‌ఎఫ్ జవాను గాల్లోకి కాల్పులు జరిపి వారిని నిలువరించాడు. తొలి దశలో పోటీచేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ(నాగ్‌పూర్), హంసరాజ్ అహిర్(చంద్రాపూర్) కిరణ్ రిజిజు(అరుణాచల్ వెస్ట్), ఆర్‌ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్(ముజఫర్‌నగర్) తదితరులున్నారు. ఎన్నికల గురించి తమ వేదికపై సుమారు 4.5 లక్షల సంభాషణలు జరిగినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఉద్యోగాలు, వ్యవసాయం, పన్నులు తదితరాల కన్నా జాతీయభద్రత గురించే ఎక్కువ చర్చ జరిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చిందని తెలిపింది.
బెంగాల్‌లో 81 శాతం.. బిహార్‌లో 50 శాతం..
తొలి దశ పోలింగ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 81 శాతం పోలింగ్ నమోదైంది. బిహార్‌లో అత్యల్పంగా 50 శాతం మందే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మిజోరంలో 61.95 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో 35.01 శాతం, జమ్మూలో 72.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్(25), తెలంగాణ(17), ఉత్తరాఖండ్(5), ఉత్తరప్రదేశ్(8), మహారాష్ట్ర(7), అస్సాం(5), బిహార్(4), ఒడిశా(4), జమ్మూ కశ్మీర్(2), పశ్చిమ బెంగాల్(2), ఛత్తీస్‌గఢ్(1), మేఘాలయ(2), అరుణాచల్‌ప్రదేశ్(2), మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్(175), అరుణాచల్‌ప్రదేశ్(57), సిక్కిం(32), ఒడిశా(28) అసెంబ్లీలకు కూడా తొలి దశలో ఎన్నికలు నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి..
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ చనిపోగా, ఒక జవాన్ గాయపడ్డాడు. ఓర్చా ప్రాంతంలోని అటవీప్రాంతంలో హెలిప్యాడ్ వద్ద భద్రతా బలగాలు సోదాలు నిర్వహించారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని డీఐజీ సుందర్‌రాజ్ చెప్పారు. బస్తర్ లోక్‌సభకు పోలింగ్ నేపథ్యంలో నిఘా బృందం ఈ ఆపరేషన్‌ను చేపట్టిందని తెలిపారు. పేట్రోలింగ్ పూర్తయిన తరువాత భద్రతా బలగాలు వెనుదిరుగుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని దీంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment