న్యూఢిల్లీ: ఒడిశాలో అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీ మాజీ ఎంపీ బైజయంత్ పాండా సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో కలిసిన అనంతరం ఆయన బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండా చేరికతో ఒడిశాలో బీజేపీకి లబ్ధి చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తొమ్మిది నెలల అంతర్మథనం.. సహచరులు, ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత బీజేపీలో చేరినట్టు బైజయంత్ తెలిపారు. తన నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒడిశా, దేశానికి చిత్తశుద్ధితో సేవ చేస్తానని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తలెత్తిన విభేదాల కారణంగా గతేడాది బీజేడీకి రాజీనామా చేశారు. తన పట్ల పార్టీ అమానవీయంగా ప్రవర్తించిందని నవీన్ పట్నాయక్‌కు రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బీజేడీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపారు.
మరోవైపు, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎంపీ కైసర్ జహాన్, మాజీ ఎమ్మెల్యే జస్మీర్ అన్సారీ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో జహాన్ సీతాపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అన్సారీ లహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment