Biju Janata Dal party
-
లోక్‌సభ బరిలోకి విద్యావేత్త సామంత
సాక్షి, భువనేశ్వర్ : సమాజంలో వెనకబడిన బడుగు వర్గాల విద్యావృద్ధిని కాంక్షించి ‘కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ), కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోసల్ సైన్సెస్ (కేఐఎస్ఎస్)’ ఉన్నత విద్యా సంస్థల స్థాపన ద్వారా విద్యారంగంలోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆధునిక విద్యావేత్త డాక్టర్ అచ్యుత సామంతకు తగిన గుర్తింపు లభించింది. స్నేహశీలిగా, మృదుభాషిగా, ఎస్సీ, ఎస్టీల విధాతగా ప్రశంసలు అందుకుంటున్న అచ్యుత సామంత సామాజిక సేవలకు గుర్తింపుగా ఆయనకు పార్టీ తరఫున కంధమాల్ లోక్‌సభ సీటును బీజూ జనతా దళ్ (బీజేడీ), ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేటాయించారు. ఇంతకుముందు ఆయన బీజేడీ తరఫునే రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. గతంలో సామాజిక రంగానికే పరిమితమై ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేసిన సామంత మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. దళితులు ఎక్కువగా ఉన్న కంధమాల్ లోక్‌సభ సీటును తనకు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముకానీయకుండా దళితులు, క్రైస్తవుల సామాజికాభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఆయన ఆరు నెలల క్రితం క్రిస్టియన్ బాల బాలికల కోసం ‘కిస్’ బ్రాంచ్‌ను ఈ నియోజక వర్గంలో ప్రారంభించారు. కంధమాల్‌లో దళితులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిజర్వ్డ్ సీటుకాదు. దళితులు, క్రైస్తవులకు పెన్నిదిగా, హిందువులకు స్నేహశీలిగా అన్నివర్గాల ప్రజలను ఆకర్షిస్తున్న అచ్యుత సామంతే అన్ని విధాల పోటీకి అర్హుడని భావించి ఆయన్ని లోక్‌సభ బరిలోకి పట్నాయక్ దించారు. విద్యావేత్తగా, సామాజిక విశిష్ట సేవకుడిగా సామంతకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. -
బీజేపీలో బీజేడీ మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: ఒడిశాలో అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీ మాజీ ఎంపీ బైజయంత్ పాండా సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఢిల్లీలో కలిసిన అనంతరం ఆయన బీజేపీలో చేరినట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండా చేరికతో ఒడిశాలో బీజేపీకి లబ్ధి చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిది నెలల అంతర్మథనం.. సహచరులు, ప్రజలతో విస్తృత సంప్రదింపుల తర్వాత బీజేపీలో చేరినట్టు బైజయంత్ తెలిపారు. తన నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒడిశా, దేశానికి చిత్తశుద్ధితో సేవ చేస్తానని అన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తలెత్తిన విభేదాల కారణంగా గతేడాది బీజేడీకి రాజీనామా చేశారు. తన పట్ల పార్టీ అమానవీయంగా ప్రవర్తించిందని నవీన్ పట్నాయక్‌కు రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బీజేడీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్టు తెలిపారు. మరోవైపు, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) మాజీ ఎంపీ కైసర్ జహాన్, మాజీ ఎమ్మెల్యే జస్మీర్ అన్సారీ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో జహాన్ సీతాపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అన్సారీ లహాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. -
పట్నాయక్ ఒంటరి పోరాటం ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోగానీ, కాంగ్రెస్ పార్టీతోగానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్ పార్టీ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 9వ తేదీన స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 2000 సంవత్సరం నుంచి వరసగా నాలుగు సార్లు విజయం సాధించి 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పట్ల ఈసారి ప్రజా వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉండడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండడం వల్ల పొత్తుల వల్ల నవీన్ పట్నాయక్ ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వైఖరి అవలంబించడం వల్ల ఆయన ఆశించిన ఫలితాలనే పొందారు. అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోని 147 సీట్లకుగాను 117 సీట్లలో 21 లోక్‌సభ సీట్లలో 20 సీట్లను బిజూ జనతా దళ్ కైవసం చేసుకొంది. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అలాగే తన మాజీ గురువు ప్యారీ మోహన్ మహపాత్ర నుంచి గట్టి పోటీ ఉన్నప్పుడు ఆయన పార్టీ ఘన విజయం సాధించడం విశేషం. అనేక ఎన్నికల్లో బిజూ జనతా దళ్ విజయానికి విశేష కృషి చేసిన మాజీ సివిల్ సర్వెంట్ మహపాత్ర నుంచి 2012లో నవీన్ పట్నాయక్ విడిపోయారు. ఆ తర్వాత 2017లో మహపాత్ర మరణించారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే బలహీన పడడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మహా కూటమి ఇంకా బలపడక పోవడం వల్ల ఇరు కూటములకు సమాన దూరంలో ఉండాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు ప్రముఖ రాజకీయ పరిశీలకుడు సూర్య నారాయణ్ మిశ్రా తెలిపారు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాగా బలపడిన బీజేపీ మళ్లీ పతనమవుతూ వస్తోంది. 2012 పంచాయతీ ఎన్నికల్లో కేవలం 36 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017 ఎన్నికల్లో 297 సీట్లను గెలుచుకోవడం విశేషం. బిజుపుర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 42 వేల మెజారిటీతో బిజూ జనతాదళ్ అభ్యర్థి గెలవడం బీజేపీ పతనాన్ని సూచిస్తోంది. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా ఉన్నప్పటికీ అంతర్గత కలహాల్లో కూరుకుపోయి ఉంది. పార్టీ మనుగడ సాగించడమే తమకు ఇప్పుడు ముఖ్యమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ మాజీ వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని నైరాశ్యాన్ని సూచిస్తోంది. -
కోడిగుడ్లతో దాడిచేస్తే టెర్రరిస్టులా?
సాక్షి, భువనేశ్వర్ : రాజకీయ నాయకులపై ప్రజలకు కోపం వస్తే వారిపైకి చెప్పులు విసరడం, ఇంక్ చల్లడం పరిపాటి. కోడిగుడ్లు విసరడం, రాళ్లు విసరటం చాలా అరుదు. అరుదైన కోడిగుడ్ల దాటి ఒరిస్సా రాష్ట్రంలో తరచుగా మారడంతో ఒరిస్సా నాయకులు లేదా ఇక్కడికి వచ్చే నాయకులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. రాళ్ల దాడికన్నా కోడిగుడ్ల దాడినే వారు ఎక్కువ తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. కోడిగుడ్లతో దాడిచేసే వారిని టెర్రరిస్టులుగా పరిగణించాలని, వారిని హత్యానేరం కింద విచారించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కోడిగుడ్ల దాడిపైనా స్థానిక టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి. కోడిగుడ్ల దాడికి భయపడి రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్ష బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన నాయకులు చివరి నిమిషంలో తమ అధికార కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వారిపై కోడిగుడ్ల దాడిని నివారించేందుకు స్థానిక పోలీసులు రాజకీయ నాయకులు వెళ్లే రూట్లలో రోడ్లపై గుడ్ల విక్రయ షాపులు లేకుండా చేస్తున్నారు. ఉంటే తాత్కాలికంగా వాటిని మూసి వేయిస్తున్నారు. కోటి గుడ్ల దాడిని నివారించడంలో విఫలమయ్యారన్న కారణంగా పోలీసు అధికారులే సస్పెన్షన్లకు గురవడంతో వారీ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. ప్రజా నాయకులపై కోడిగుడ్ల దాడికి దిగుతున్న వారిలో స్థానిక ప్రజలకన్నా స్థానిక రాజకీయ పార్టీల కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండేళ్ల కాలంలో ఒరిస్సాలో ప్రజా నాయకులపై 15 కోడి గుడ్ల దాడులు జరిగాయి. వాటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు సహా పలువురు బిజూ జనతాదళ్ నాయకుల వాహనాలపై 13 దాడులు జరగ్గా, కేంద్ర మంత్రి జువల్ ఓరమ్ సహా ఇద్దరు బీజేపీ నాయకులపై రెండు దాడులు జరిగాయి. ఈ మొత్తం 15 దాడుల్లో 14 దాడులకు సంబంధించి 76 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి వారిపై కేసులు నమోదు చేశారు. మరో కోడిగుడ్ల దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దాడిలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. 2015, ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళుతుండగా, ఆయన వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి జరపడంతో రాష్ట్రంలో కోడిగుడ్ల దాడికి నాంది పలికింది. కోడిగుడ్ల దాడిని నివారించడంలో విఫలమయ్యారన్న కారణంగా ఇంతవరకు ఏడుగురు పోలీసు అధికారులు సస్సెండ్ అయ్యారు. ఎవరిపైనైనా కోడిగుడ్ల దాడి జరపడం మంచిదికాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి ప్రసాద్ హరిచందన్ పార్టీ కార్యకర్తలకు హితవు చెప్పగా, అన్ని రంగాల్లో విఫలమైన నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఇలాంటి దాడులు అవసరమైన ఇతరులు వాదించారు. ఈ దాడులు జరిపేవారిని టెర్రరిస్టులుగా భావించి వారిపై హత్యానేరం కింద విచారించాలని బిజూ జనతాదళ్ భువనేశ్వర్ ఎంపీ ప్రసన్న పట్టసాని డిమాండ్ చేశారు. -
భూ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి
కాంగ్రెస్, తృణమూల్, బీజేడీల డిమాండ్ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు డిమాండ్ చేశాయి. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని పార్లమెంట్ జాయింట్ కమిటీకి బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్‌లు ఇదివరకే లేఖ రాశాయి. కాంగ్రెస్ పలు సిఫారసులను కమిటీకి సోమవారం సమర్పించనుంది. ఈ బిల్లులోని వివిధ క్లాజ్‌లపై వోటింగ్ సందర్భంగా పార్టీలన్నీ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. భూములు కోల్పోయేవారికి నష్టపరిహారాన్ని పట్టణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు రెట్లుగా ఉందని, దీనిని రెండు ప్రాంతాల్లోనూ సమానంగా మార్కెట్ ధరకు 4 రెట్లుగా చేయాలన్న తమ డిమాండ్‌కే ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు. బిల్లును ఉపసంహరించుకోవాలని తృణమూల్ నేత ఒకరు స్పష్టం చేశారు. భూములను లాభదాయక ప్రాజెక్టులకు సేకరించినప్పుడు భూమిని కోల్పోయినవారిని అందులో వాటాదారులుగా చేర్చడంవంటి అంశాలకు బీజేడీ మద్దతు పలికింది.