సాక్షి, న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతోగానీ, కాంగ్రెస్ పార్టీతోగానీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బిజూ జనతాదళ్ పార్టీ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జనవరి 9వ తేదీన స్పష్టం చేసిన విషయం తెల్సిందే. 2000 సంవత్సరం నుంచి వరసగా నాలుగు సార్లు విజయం సాధించి 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పట్ల ఈసారి ప్రజా వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్‌తోగానీ, బీజేపీతోగానీ పొత్తుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది రాజకీయ పరిశీలకుల ప్రశ్న.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉండడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉండడం వల్ల పొత్తుల వల్ల నవీన్ పట్నాయక్ ప్రయోజనం లేదని భావించి ఉండవచ్చు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వైఖరి అవలంబించడం వల్ల ఆయన ఆశించిన ఫలితాలనే పొందారు. అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలోని 147 సీట్లకుగాను 117 సీట్లలో 21 లోక్‌సభ సీట్లలో 20 సీట్లను బిజూ జనతా దళ్ కైవసం చేసుకొంది. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అలాగే తన మాజీ గురువు ప్యారీ మోహన్ మహపాత్ర నుంచి గట్టి పోటీ ఉన్నప్పుడు ఆయన పార్టీ ఘన విజయం సాధించడం విశేషం. అనేక ఎన్నికల్లో బిజూ జనతా దళ్ విజయానికి విశేష కృషి చేసిన మాజీ సివిల్ సర్వెంట్ మహపాత్ర నుంచి 2012లో నవీన్ పట్నాయక్ విడిపోయారు. ఆ తర్వాత 2017లో మహపాత్ర మరణించారు.
బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే బలహీన పడడం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మహా కూటమి ఇంకా బలపడక పోవడం వల్ల ఇరు కూటములకు సమాన దూరంలో ఉండాలని నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు ప్రముఖ రాజకీయ పరిశీలకుడు సూర్య నారాయణ్ మిశ్రా తెలిపారు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాగా బలపడిన బీజేపీ మళ్లీ పతనమవుతూ వస్తోంది. 2012 పంచాయతీ ఎన్నికల్లో కేవలం 36 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017 ఎన్నికల్లో 297 సీట్లను గెలుచుకోవడం విశేషం. బిజుపుర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై 42 వేల మెజారిటీతో బిజూ జనతాదళ్ అభ్యర్థి గెలవడం బీజేపీ పతనాన్ని సూచిస్తోంది. బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా ఉన్నప్పటికీ అంతర్గత కలహాల్లో కూరుకుపోయి ఉంది. పార్టీ మనుగడ సాగించడమే తమకు ఇప్పుడు ముఖ్యమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ మాజీ వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని నైరాశ్యాన్ని సూచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment