కోడిగుడ్లతో దాడిచేస్తే టెర్రరిస్టులా?
సాక్షి, భువనేశ్వర్ : రాజకీయ నాయకులపై ప్రజలకు కోపం వస్తే వారిపైకి చెప్పులు విసరడం, ఇంక్ చల్లడం పరిపాటి. కోడిగుడ్లు విసరడం, రాళ్లు విసరటం చాలా అరుదు. అరుదైన కోడిగుడ్ల దాటి ఒరిస్సా రాష్ట్రంలో తరచుగా మారడంతో ఒరిస్సా నాయకులు లేదా ఇక్కడికి వచ్చే నాయకులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. రాళ్ల దాడికన్నా కోడిగుడ్ల దాడినే వారు ఎక్కువ తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. కోడిగుడ్లతో దాడిచేసే వారిని టెర్రరిస్టులుగా పరిగణించాలని, వారిని హత్యానేరం కింద విచారించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కోడిగుడ్ల దాడిపైనా స్థానిక టీవీ చానళ్లు చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాయి.
కోడిగుడ్ల దాడికి భయపడి రాజకీయ నాయకులు, ముఖ్యంగా పాలకపక్ష బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన నాయకులు చివరి నిమిషంలో తమ అధికార కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వారిపై కోడిగుడ్ల దాడిని నివారించేందుకు స్థానిక పోలీసులు రాజకీయ నాయకులు వెళ్లే రూట్లలో రోడ్లపై గుడ్ల విక్రయ షాపులు లేకుండా చేస్తున్నారు. ఉంటే తాత్కాలికంగా వాటిని మూసి వేయిస్తున్నారు. కోటి గుడ్ల దాడిని నివారించడంలో విఫలమయ్యారన్న కారణంగా పోలీసు అధికారులే సస్పెన్షన్లకు గురవడంతో వారీ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.
ప్రజా నాయకులపై కోడిగుడ్ల దాడికి దిగుతున్న వారిలో స్థానిక ప్రజలకన్నా స్థానిక రాజకీయ పార్టీల కార్యకర్తలే ఎక్కువగా ఉంటున్నారు. గత రెండేళ్ల కాలంలో ఒరిస్సాలో ప్రజా నాయకులపై 15 కోడి గుడ్ల దాడులు జరిగాయి. వాటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్ర మంత్రులు సహా పలువురు బిజూ జనతాదళ్ నాయకుల వాహనాలపై 13 దాడులు జరగ్గా, కేంద్ర మంత్రి జువల్ ఓరమ్ సహా ఇద్దరు బీజేపీ నాయకులపై రెండు దాడులు జరిగాయి. ఈ మొత్తం 15 దాడుల్లో 14 దాడులకు సంబంధించి 76 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి వారిపై కేసులు నమోదు చేశారు. మరో కోడిగుడ్ల దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దాడిలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు.
2015, ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళుతుండగా, ఆయన వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి జరపడంతో రాష్ట్రంలో కోడిగుడ్ల దాడికి నాంది పలికింది. కోడిగుడ్ల దాడిని నివారించడంలో విఫలమయ్యారన్న కారణంగా ఇంతవరకు ఏడుగురు పోలీసు అధికారులు సస్సెండ్ అయ్యారు. ఎవరిపైనైనా కోడిగుడ్ల దాడి జరపడం మంచిదికాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జి ప్రసాద్ హరిచందన్ పార్టీ కార్యకర్తలకు హితవు చెప్పగా, అన్ని రంగాల్లో విఫలమైన నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఇలాంటి దాడులు అవసరమైన ఇతరులు వాదించారు. ఈ దాడులు జరిపేవారిని టెర్రరిస్టులుగా భావించి వారిపై హత్యానేరం కింద విచారించాలని బిజూ జనతాదళ్ భువనేశ్వర్ ఎంపీ ప్రసన్న పట్టసాని డిమాండ్ చేశారు.