విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులుగా ప్రకటిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలిపారు. ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక హోదా సాధన సమితి భవిష్యత్ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చలసాని శ్రీనివాస్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర నేత వై వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ అప్పలనాయుడు, సదాశివరెడ్డి, విశ్వనాద్, రఫీ, రాయప్ప, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వెయ్యికి పైగా కార్యక్రమాలు చేశామన్నారు.
జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి సాధన సమితి కమిటీలు ఏర్పాటు చేసి, పదిలక్షల కరదీపికల ప్రచురిస్తామని తెలిపారు. జూన్ 15 తరువాత విద్యార్థి సంఘాలన్నీ కలిసి విద్యా సంస్థల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఊరేగింపులు కూడా చేపడతామని చెప్పారు. జూలై నుంచి యూనివర్శిటీలకు బస్సు యాత్రను చేపట్టి, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని అన్నారు. కడప ఉక్కు..ఆంధ్రుల హక్కని, గిరిజన విశ్వవిద్యాలయం తదితర సంస్థల కోసం ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేపడతామని తెలిపారు. జాతీయ రహదారులు రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతాల్లో రహదారుల నిర్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హోదా కోసం కలిసి వచ్చే అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల మద్ధతుకు కృతజ్ఞతలు తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, హోదా సాధన సమితి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ..రాష్ట్రంలో బీజేపీ నెగెటివ్ ప్రచారం చేస్తోందని వ్యాఖ్యానించారు.‘ కేంద్రం అన్ని హామీలను నేరవేర్చిందని ప్రచారం చేస్తున్నారు. విభజన హామీల్లో ఏం నెరవేర్చారో చెప్పాలని సవాల్ చేస్తున్నాం. వెనుకబడిన జిల్లాలకు బుందేల ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని అన్నారు. రాజధాని నిర్మాణానికి కేవలం పదిహేను వందల కోట్ల నిధులు ఇచ్చి, దానికి కూడా యూసీలు ఇవ్వలేదు. సిగ్గులేకుండా బీజేపీ నాయకులు కేంద్రాన్ని సమర్ధిస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి వరకు తీసుకు వెళ్లబోతున్నాం. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోంద’ని రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు.
సీపీఎం రాష్ట్ర నేత, వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..నయవంచన మాటలతో బీజేపీ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తోందని వ్యాఖ్యానించారు. హోదా కోసం విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తామని, సమస్య ఉన్న చోట్ల ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment