ఎన్నికలంటే.. ప్రజాస్వామ్యయుతంగా గత పదవీకాలంలో చేసిన మేలు చెప్పాలి లేదా కొత్త అభ్యర్థులైతే తమను ఎన్నుకుంటే ఏం చేస్తామో చెప్పి.. ప్రజలను ఓట్లు అభ్యర్థించాలి.. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి.
కానీ అ అభ్యర్థి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యాంగా మార్చేశారు. ఎలక్షనీరింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పారు.
ప్రజలిచ్చిన పదవిని స్వార్థానికి.. ఆదాయార్జనకు దుర్వినియోగం చేయడం.. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి నోట్ల కట్ల తెంచడం.. ప్రలోభాల ఎర వేయడం.. మద్యం వరద పారించడం.. చోటా మోటా నేతలను కొనేయడం.. హోల్‌సేల్‌గా ఓట్లు రాబట్టుకోవడం.. ఇదీ ఆయనగారి ఎలక్షనీరింగ్..
ఈ విధానాలతో ప్రజలకు దూరమైన ఆయన ప్రతి ఎన్నికకూ నియోజకవర్గాన్ని మార్చేయక తప్పడం లేదు.. ఆ విధంగానే ఈసారి భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తరలివచ్చిన మంత్రి, టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడా అదే వ్యూహం అమలు చేయాలనుకున్నారు. కానీ పట్టణ ప్రాంతం కావడంతో ఇక్కడ ఆ పప్పులు ఉడకడం లేదు. పైగా ప్రధాన ప్రత్యర్థి ప్రచారంలోనే చుక్కలు చూపిస్తుండటంతో.. గంటా వారు వ్యూహం మార్చి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకేరాజుపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.
సాక్షి, విశాఖపట్నం: ఇన్నాళ్లూ నోట్ల కట్టలు, విలువైన వస్తువులతో ప్రలోభపెట్టడం తరహా ఎలక్షనీరింగ్‌నే నమ్ముకుని.. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఈసారి పోటీ చేస్తున్న ఉత్తర నియోజకవర్గంలోనూ ప్రలోభాలతోనే గట్టెక్కాలని వ్యూహరచన చేశారు. కబ్జాలు, భూ దందాల ద్వారా సంపాదించిన అక్రమార్జనను కుమ్మరిస్తున్నారు. పెద్దగా ప్రచారం చేయకుండానే గెలుస్తానన్న ధీమాతో డబ్బులు విరజిమ్ముతున్నారు. ప్రచారం కంటే సంఘాలు, కులాల వారీగా భేటీలు జరుపుతూ కోట్లు ఎర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఎక్కువ మంది విద్యావంతులు, మేధావులు కావటంతో గంటా ప్రలోభాలకు లొంగే అవకాశం కూడా కనిపించటం లేదు. మంత్రిగారి అవినీతి గురించి ఇప్పటికే ఊరూవాడా తెలిసిపోవటంతో ఓటమి తప్పదన్న నిర్ధారణకు వచ్చేసిన ఆయన త్త కుయుక్తులకు దిగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రచారంలో చుక్కలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకేరాజు గత ఆర్నెల్లుగా నియోజకవర్గంలో బలమైన క్యాడర్‌తో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాలనూ కలుపుకొని వెళుతుండటంతో పార్టీలో చేరికలు బాగా పెరిగాయి. గంటా అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత టీడీపీతో పాటు జనసేనకు చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రచారంలో గంటాపై కేకే రాజు స్పష్టమైన ఆదిక్యత కనబరుస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో పార్టీ నుంచే సహకారం లేకపోవడం, ప్రచారానికి వెళ్తే ప్రజల్లో కనీస స్పందన లేకపోవడంతో గంటా దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్న గంటా కొత్త ఎత్తుగడ వేశారు. ఓపైపు కోట్లు కుమ్మరిస్తూ ఓట్లు కొనుగోలు చేస్తూనే మరో వైపు ప్రత్యర్థులపై మైండ్‌గేమ్ ఆడుతున్నారు. తన అనుచరులతో కలిసి ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు తనకు లొంగిపోతున్నారంటూ విషప్రచారం మొదలెట్టారు.
విషప్రచారం
కేకేరాజుతో సన్నిహితంగా ఉండే పలువురు నేతలు తమ వైపు వచ్చేస్తున్నారని..వాళ్లంతా ఒకేరోజు రాజీనామాలను చేసేస్తున్నారంటూ దుష్ప్రచారం మొదలు పెట్టారు. నిజానికి పెద్ద సంఖ్యలో చేరికలతో వైఎస్సార్‌సీపీ రోజురోజుకు నియోజకవర్గంలో బలపడుతూ.. విజయాన్ని దాదాపుగా ఖరారు చేసుకుంటోంది. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉత్తర నియోజకవర్గ జనసేన నేతలు గుంటూరు భారతి దంపతులు శుక్రవారం వై.ఎస్.జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ షాక్‌ల నుంచి తేరుకోవటానికి గంటా ఫైనల్‌గా కోవర్టు ఆపరేషన్ మొదలæట్టారు. పోలింగ్‌కు ఐదు రోజులు మాత్రమే ఉండడంతో ఫలానా పార్టీ వార్డు అధ్యక్షుడు మా పార్టీలోకి వచ్చేస్తున్నాడు. ఫలానా అభ్యర్థి నాకు లొంగిపోయారు, కోట్లకు అమ్ముడు పోయారంటూ గోబెల్స్ ప్రచారానికి తెరతీయడంతో బరిలో నిలిచిన అభ్యర్థులే కాదు.. నియోజకవర్గ ప్రజలు సైతం గంటా తీరుపై మండిపడుతున్నారు. ఇదేంరాజకీయమని ప్రశ్నిస్తున్నారు. నిజంగా దమ్ముంటే నేరుగా తలపడాలే తప్ప ఇలా దొడ్డిదారి కుయుక్తులు, కుట్రలకు పాల్పడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓటమి పాలవడం ఖాయమని ఉత్తర నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment