కిషోర్ సమ్మిట్
భోపాల్ : ఎన్నికల ప్రచారానికి డబ్బుల్లేవు.. రూ. 75 లక్షల రూపాయలు అయినా ఇవ్వండి లేదా కిడ్నీలు అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వండంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశాడు సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిషోర్ సమ్మిట్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన బాలాఘాట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ప్రచారానికి తన దగ్గర డబ్బుల్లేవని, తన ప్రత్యర్థులంతా ధనవంతులని, వారితో పోటీ పడాలంటే తనకు డబ్బుకావాలని ఈసీని కోరారు.
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ. 75లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. అయితే అంత డబ్బు తన దగ్గర లేదని, ఎన్నికల ప్రచారానికి 15 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అంత డబ్బును తాను సమకూర్చుకోలేనని చెప్పారు. తనకు రూ. 75 లక్షలు సమకూర్చాలని, లేదా బ్యాంకుల నుంచి లోనుగా అయినా ఇప్పించాలని, అదీ కుదరకపోతే తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీకి లేఖ రాశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని అభ్యర్థులంతా అవినీతి పరులని, వారు డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేస్తున్నారని అందుకే ఈసీకి లేఖ రాశానని చెప్పారు. ‘ భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు ప్రధాన మంత్రి కావచ్చు. కానీ డబ్బు ఉన్న వారే పోటీ చేస్తున్నారు. ఎన్నికల సంఘం నియమాలు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఖర్చు చేసేందుకు అనుమతి ఇవ్వొద్దని ఈసీకి తెలిపేందుకే ఈ లేఖ రాశా. ప్రస్తుతం ఉన్న ఈసీ నిబంధనలు మారాలి. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేందుకు ఈసీ ఎందుకు అనుమతి ఇవ్వాలి? ధన బలం ఉన్నవారే అధికారంలోకి రావాలా? ప్రస్తుతం ఉన్న ఈసీ చట్టాల ప్రకారం సామన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నాడు. ఎన్నికలు నిజాయితీగా, ఫ్రీగా జరగాలి’ అని కిషోర్ పేర్కొన్కారు.
రాష్ట్రంలో నాలుగు దశలుగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఏప్రిల్ 29న జరుగుతాయి. మే 6, 12,19 తేదిలలో మిగిలిన మూడు దశల ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి.
Comments
Please login to add a commentAdd a comment