ఏలూరు: బీసీల స్థితిగతులను స్వయంగా తన పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ తెలుసుకున్నారని, వారు అన్నివిధాలా అభివృద్ధి చెందడానికే రేపు(ఆదివారం) బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని, రేపు(ఆదివారం) బీసీలకు సువర్ణ దినమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఏలూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే బీసీ గర్జన బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, పార్థసారధి, జంగా కృష్ణ మూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషు బాబు తదితరులు పరిశీలించారు.
అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ.. నాడు బీసీలకు మేలు చేసిన మహానేత వైఎస్సార్ అని, ఆయన అడుగుజాడల్లోనే వైఎస్సార్ తనయుడిగా వైఎస్ జగన్ బీసీలకు మరింత మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాల ద్వారా వైఎస్సార్, బీసీలకు మేలు చేశారని అన్నారు. బీసీల అభివృద్ధి పట్ల వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు.
బీసీలకు బాబు చేసిందేమీ లేదు: పెద్దిరెడ్డి
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు ఏమీ మేలు చేయలేదని వైఎస్‌ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్రబాబు వరకు బీసీలను ఆదుకునే కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదని చెప్పారు. బీసీలను టీడీపీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని తెలిపారు. వైఎస్సార్ కులమతాలకతీతంగా తన పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ పథకాలతో ఎక్కువ మేలు జరిగింది బీసీలకేనని వెల్లడించారు. రేపటి సభలో వైఎస్ జగన్ చేయబోయే బీసీ డిక్లరేషన్‌తో బీసీలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment