
సాక్షి, ముంబై: దేశంలో గత మూడేళ్లలో అయిదు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు పోషించిన పాత్ర వివాదాస్పదం అయింది. ఈ రాష్ట్రాల్లో గవర్నర్లు బీజేపీ కోసం గేమ్ చేంజర్‌లుగా మారారు.
2017లో...
గోవాలో 2017 ఎన్నికల్లో అసెంబ్లీలోని 40 స్థానాలకు 18 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, గవర్నరు మృదులా సిన్హా ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకే అవకాశమిచ్చారు. ఈ విషయంపై కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో గవర్నర్ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతోపాటు, 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో 28 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ 21 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అయినప్పటికీ, గవర్నర్ కాంగ్రెస్‌ను కాదని, బీజేపీకి చాన్సివ్వడంతో కమలదళం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
2018లో...
కర్ణాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం గవర్నర్ వజూభాయ్ వాలా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించారు. అయితే, బలపరీక్షలో బీజేపీ ఓడిపోయింది. సీఎం యడియూరప్పరాజీనామా చేయడంతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. అనంతర పరిణామాల్లో అధికార కూటమిలోని 17 మంది ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. ఆపై మళ్లీ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్– జేడీఎస్ వాదనలను గవర్నర్ వినిపించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లకు గాను 21 స్థానాలతో కాంగ్రెస్ పెద్ద పార్టీగా అవతరించింది. గవర్నర్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీని, దాని మిత్రపక్షం 19 సభ్యులున్న ఎన్‌పీపీని ఆహ్వానించడం వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment