సీఎం అరవింద్ కేజ్రీవాల్.. పక్కన సీఎస్ అన్షు ప్రకాశ్ (కుడి)
సాక్షి, న్యూఢిల్లీ : అర్ధరాత్రి హైడ్రామాగా మొదలైన ప్రభుత్వ కార్యదర్శిపై ఎమ్మెల్యేల దాడి వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో పెను కలకలం రేపుతోంది. పరిపాలనకు కేంద్రబిందువైన వ్యక్తిపైనే దాడి చోటు చేసుకోవటంతో అధికారుల సంఘం నిరసనకు దిగగా... పోటీగా ఇప్పుడు ప్రభుత్వం ధర్నా చేపట్టం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ మూలంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతాన్ని ఓసారి పరిశీలిస్తే... పాలనాపరమైన నిర్ణయాల్లో మొదటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండిస్తూనే ఉన్నారు. ఎల్జీ పదవిని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం(బీజేపీ) పాలనకు అడ్డుతలుగుతుందని గతంలో ఆయన ఆరోపణలు గుప్పించారు కూడా. ఒకానోక టైంలో గత ఎల్జీ నజీబ్‌జంగ్ తో ఆయన వివాదం తారాస్థాయికి చేరి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగుతుందని, ముఖ్యమంత్రికి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నప్పటికీ... దానికి పరిపాలనాధికారి లెఫ్ట్‌నెంట్ గవర్నరే(ఎల్జీ)నని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఆపై కొంత కాలం పరిస్థితులు మాములుగానే గడిచిపోయాయి. తర్వాత నజీబ్ స్థానంలోకి వచ్చిన అనిల్ బైజాల్ కూడా ఆ పంథానే కొనసాగించగా.. ఎల్జీ తీరు పట్ల కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా భావించి ప్రభుత్వ సేవలు ఇంటి గుమ్మం వద్దకే అన్న పథకం ప్రవేశపెడితే.. దానికి ఎల్జీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే హోం డెలివరీ సర్వీసెస్ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకించడం లేదని, మరోసారి సాధ్యాసాద్యాలు పరిశీలించాలని మాత్రమే కోరారని అధికారులు వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన భేటీలో ఎల్జీ నిర్ణయమే శిరోధార్యమని సీఎస్ అన్షు ప్రకాశ్ వ్యాఖ్యానించటం.. తట్టుకోలేని ఆప్ ఎమ్మెల్యేలు ప్రకాశ్ జార్వాల్, అమాన్ తుల్లా ఖాన్ సీఎస్‌పై దాడి చేయటం.. ఎమ్మెల్యేల అరెస్టులు.. పోటాపోటీగా ప్రభుత్వం ధర్నా చేపట్టం... ఇలా ఢిల్లీ రాజకీయాలు గందరగోళంగా తయారయ్యాయి. కేంద్రం జోక్యం సంగతి పక్కనపెడితే గత కొంతకాలంగా కీలక నిర్ణయాలేవీ అమలు కాకుండా పోవటంతో పాలన కుంటుపడింది. దీనికితోడు ప్రస్తుత పరిణామాలు, వాటి మూలంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సమీప భవిష్యత్తులో ఢిల్లీ పరిపాలనకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని సీనియర్ బ్యూరోక్రట్లు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment