సాక్షి, విశాఖపట్నం: ‘నేను... 3 గ్రామాలు.. నా 33 వేల ఎకరాలు’ అనే మాట తప్ప ప్రతిపక్ష నేత చంద్రబాబు నోట మరో మాట కూడా రాలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు గానీ అమరావతిలో బినామీల పేరిట కొనుగోలు చేసిన 33 వేల ఎకరాల భూములు ఏమీ కాకూడదని చంద్రబాబు అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్నం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి.. వాస్తవాలను కాకుండా టీడీపీ నేతలు ఊహించుకున్నదంతా చెబుతూ పోతే సరిపోదన్నారు. అసలు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఎందుకు వేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో హుద్‌హుద్ తుఫాన్ సమయంలో రికార్డులు పోయాయంటూ టీడీపీ నేతలు భూ కుంభకోణాల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కియా మోటార్స్ సంస్థ వెళ్లిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఆ సంస్థ యాజమాన్యమే చెప్పిందని పేర్కొన్నారు. గడచిన 14 ఏళ్లలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని అమర్‌నాథ్ సవాల్ విసిరారు. గతంలో రాయలసీమలో జరిగిన ఒక కార్యక్రమంలో... రాయలసీమలో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎస్ రాజ«శేఖర్‌రెడ్డిలాగా సింహం లాంటివారు పుట్టిన ఈ గడ్డపై నక్కలాంటి మా అల్లుడు ఎలా పుట్టాడో అని చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి అన్నారని గుర్తుచేశారు.
జనసేన గ్లాస్ పగిలిపోయింది
జనసేన గ్లాస్ పగిలిపోయిందని, పవన్ కల్యాణ్ కూడా ఆ పార్టీ గుర్తులాంటివాడేనని గుడివాడ అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. అందరికీ ఉండాల్సిన రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం పవన్ కల్యాణ్‌కు లేవన్నారు. ఒక్క విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తున్నాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బాగుంటే సినిమాలు తీసుకుంటానని ఓ బహిరంగ సభలో చెప్పిన మాటను నిజం చేస్తున్నాడని పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బాగుండడం కారణంగానే పవన్ కల్యాణ్ గడ్డాలు తీసేసి సినిమాలకు సిద్ధమయ్యాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment