గాంధీనగర్ : పలు ఊహాగానాల నడుమ గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రి పేరును బీజేపీ ఖరారుచేసింది. ఎలాంటి ట్విస్టులు, టర్నింగ్‌లకు తావు ఇవ్వకుండా తాజా మాజీ విజయ్ రూపానీనే తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు సిద్ధమైంది. గాంధీనగర్‌లో బీజేఎల్పీ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందే ఈ మేరకు పార్టీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. బీజేఎల్పీ నేతగా విజయ్ రూపానీని ఎన్నుకున్నట్లు గుజరాత్ వ్యవహారాల పరిశీలకుడు అరుణ్ జైట్లీ ప్రకటించారు.
సెంచరీ మార్కు.. : మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను కైవసం చేసుకుని ఆరోసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మూడంకెల సీట్లు సాధించలేకపోయామని మధన పడుతోన్న బీజేపీకి.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రతన్‌సిన్హ్ రాథోడ్ మద్దతు పలకడంతో సెంచరీ మార్కు దాటినట్లైంది.
ఇద్దరు డిప్యూటీ సీఎంలు! : ఇక రూపానీతోపాటు తాజా మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ తన పదవిని నిలుపుకొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్ తరహాలో గుజరాత్‌లోనూ బీజేపీ ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. డిప్యూటీ సీఎం రేసులో ఉన్న ఆ రెండో వ్యక్తి.. మాజీ స్పీకర్, గిరిజన నాయకుడు గణపత్ వాసవ్య అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే చివరికి నిత్ పటేల్ ఒక్కరినే డిప్యూటీ సీఎంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment