
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ మరోసారి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రిలోగా తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని తేల్చిచెప్పారు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు తమ షరతులకు ఒప్పుకోవాలని హార్థిక్‌కు చెందిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తుంది. ముఖ్యంగా వచ్చేనెల జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో తమ మద్దతుదారులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని పటీదార్ గ్రూప్ కోరుతోంది. తమ మద్దదుదారులకు టికెట్ ఇస్తేనే.. కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతామని తేల్చిచెబుతోంది. అయితే, కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇవ్వడానికి వెనుకాడుతోంది. హార్థిక్ మద్దతు కోసం 30 సీట్లు ఇవ్వడమంటే చాలా ఎక్కువనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సీట్ల విషయమై చర్చించేందుకు హార్థిక్ మద్దతుదారులను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. ఈ చర్చల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న పటీదార్ గ్రూప్ కన్వీనర్ దినేశ్ బంభానియా మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రిలోపు తమ డిమాండ్లపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని, లేకుంటే కాంగ్రెస్‌కు తమ మద్దతు అవసరం లేదని భావించాల్సి ఉంటుదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఖరిని బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment