తెలంగాణ నాశనమే బాబు విధానం | Harish Rao Slams AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

తెలంగాణ నాశనమే బాబు విధానం

Published Fri, Nov 9 2018 1:29 AM | Last Updated on Fri, Nov 9 2018 9:04 AM

Harish Rao Slams AP CM Chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో నీటి ప్రాజెక్టులను అడ్డుకొని రైతాంగం నోట మట్టికొట్టేందుకు నిరంతరం కుట్రలు పన్నుతున్న ఏపీ సీఎం చంద్రబాబులో నరనరానా తెలంగాణ ద్వేషం జీర్ణించుకుపోయిందని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణలో ఇప్పటికే అడ్రస్‌ లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీని ఈ ఎన్నికల్లో ఎంతో కొంత బతికించుకునేందుకు, తెలంగాణలో నీటి ప్రాజెక్టుల మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు మహాకూటమితో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అంటేనే తెలంగాణ ప్రజల్లో అనేక అనుమానాలున్నాయన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇక్కడి నీటి ప్రాజెక్టులు అక్రమమంటూ కేంద్రానికి, సీడబ్ల్యూసీ, ఇతర సంస్థలకు అనేక లేఖలు రాసి తెలంగాణపై ఆయన ద్వేషాన్ని అనేకమార్లు చాటుకున్నారని మండిపడ్డారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పూర్తి చేస్తామన్న ప్రాజెక్టులు... ఆయన ఏపీ సీఎం కాగానే ఎలా అక్రమమయ్యాయని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలో పంటలు ఎండిపోవాలి. పరిశ్రమలు మూతపడాలి. కరెంటు ఉండకుండా చేయాలి. ఇందుకు ఆయన అవలంబించని కుట్రే లేదు’’అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. తెలంగాణను విఫల ప్రయోగంగా చూపించడానికి ఆయన పాల్పడని ద్రోహం లేదన్నారు. తెలంగాణ నాశనమే బాబు విధానమని ఆరోపించారు.

తెలంగాణలో బాబు చేసిన ఉద్యమ ద్రోహాలకు క్షమాపణ చెప్పకుండా ఇక్కడ ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారని నిలదీశారు. ఏనాడైనా తెలంగాణ తల్లికి పూలదండ వేసిన మనిషా? అని ప్రశ్నించారు. బాబు చేసిన ద్రోహాలను, ఉద్యమ నాయకుడిగా స్థానిక ప్రజాప్రతినిధిగా ఎండగట్టే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు అరాచకాలకు ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని పక్కనబెట్టుకుని తెలంగాణ ప్రజలకు ఏ ముఖంతో ఓట్లు అడిగేందుకు వస్తారని కాంగ్రెస్‌ నాయకులను నిలదీశారు. తెలంగాణకు వ్యతిరేకంగా పన్నిన 19 కుట్రలకు సమాధానం చెప్పాలంటూ చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. 

చంద్రబాబుకు హరీశ్‌ సంధించిన ప్రశ్నలివే.. 

  • శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన లేఖలో తెలంగాణకు 1,330 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు టీడీపీ నివేదిక ఇచ్చింది. దానికి అనుగుణంగానే ప్రాజెక్టులు కడుతుంటే అడ్డుపడటం లేదా? 
  • పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం, దిండి, భక్త రామదాసు ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ లేఖలు రాయడం కుట్ర కాదా? పాలమూరును గతంలో దత్తత తీసుకొని ఇలాంటి చర్యలకు ఎలా పాల్పడతారు. మోదీతో కలసి పాల్గొన్న మహబూబ్‌నగర్‌ ఎన్నికల సభలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డిని పూర్తి చేస్తామని ప్రకటించి ఇప్పుడు లేఖలు రాయడం నిజం కాదా? 
  • తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపై లేఖలతో విషం చిమ్మడం అబద్ధమా? కేంద్రం, కేంద్ర జలవనరులశాఖ, పర్యావరణ అనుమతులున్న ప్రాజెక్టు అక్రమమంటూ లేఖ రాయలేదా? 
  • పాలేరులో భక్త రామదాసు ప్రాజెక్టుకు అడ్డుపడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పాలేరులో ఓట్లడుగుతారు? 
  • కేసీ కెనాల్‌ కోసం తుమ్మిళ్ల ప్రాజెక్టు వద్దనడం తెలంగాణపై చేసిన కుట్ర కాదా? అలంపూర్‌లో పోటీ చేసే మహాకూటమి అభ్యర్థి తుమ్మిళ్ల వద్దని ఓట్లడుగుతారా? 
  • కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెం చుకునే హక్కు తెలంగాణకు ఉన్నా దానిపైనా కేంద్రానికి లేఖలతో కొర్రీలా? సొంత రాష్ట్రంలో మా ప్రాంతానికి నీటి కేటాయింపులు చేసే హక్కు మాకు లేదా? ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న పాలమూరును తిరిగి ఎడారి చేయడానికి కుట్రలకు పాల్పడలేదా? 
  • పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కేటాయింపులు చేయొద్దని లేఖ రాయడం తెలంగాణకు చేసిన ద్రోహం కాదా? కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చినప్పుడు తెలంగాణపై ఎందుకు అభ్యంతరం? 
  • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్లు కేటాయించొద్దని అక్టోబర్‌ 9న లేఖ రాసి తాజా ద్రోహానికి ఒడిగట్టలేదా? శ్రీశైలం నీళ్లొచ్చే తెలంగాణ నియోజకవర్గాల్లో మహాకూటమి ఓట్లు ఎలా అడుగుతుంది? 
  • పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల, ముచ్చుమర్రి, గుండ్రేవుల, గాజులదిన్నె తదితర అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం వాస్తవం కాదా? వాటి డీపీఆర్‌లు తెలంగాణకు ఎందుకు పంపలేదు? 
  • తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందే మోదీ పై ఒత్తిడి చేసి పోలవరం ఏడు మండలాలు కలుపుకుని తెలంగాణకు తొలి ద్రోహం చేయలేదా? 
  • పోలవరం ముంపు మండలాలతోపాటు 365 రోజులపాటు 60 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేసే లోయర్‌ సీలేరు హైడల్‌ పవర్‌ ప్రాజెక్టును లాక్కొని తెలంగాణకు ఏటా రూ. 500 కోట్ల మేర నష్టం కలిగించట్లేదా? ఇది తెలంగాణకు చేసిన శాశ్వత నష్టం కాదా? 
  • విద్యుత్‌ పంపిణీ విషయంలో తెలంగాణపట్ల దుర్మార్గంగా వ్యవహరించలేదా? విభజన చట్టాన్ని గౌరవించకుండా తెలంగాణకు ఏపీ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా అన్యాయం చేయలేదా? తెలంగాణలో మొదటి ఏడాది కరెంటు కష్టాలకు బాబు కసాయితనం కారణం కాదా? 
  • తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలతో ఏపీ జెన్‌కో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి 2,465 మెగావాట్ల కరెంటును తెలంగాణకు ఇవ్వకుండా అడ్డుపడింది నిజం కాదా? 
  • మీ నిర్వాకం వల్ల తెలంగాణ బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసి రూ. 4,557 కోట్ల నష్టపోవడం వాస్తవం కాదా? 
  • తెలంగాణకు కరెంటు ఇవ్వనని చెప్పి ఓపెన్‌ టెండర్లలో పాల్గొని తెలంగాణకు కరెంటు ఇస్తామని చెప్పడం దుర్మార్గం కాదా? 
  • తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ విద్యుత్‌ ఉద్యోగులను తీసుకోకపోవడంతో రాష్ట్రంపై ఇప్పటివరకు రూ. వెయ్యి కోట్ల భారం పడింది నిజం కాదా? 
  • హైదరాబాద్‌లో కేటాయించినా వాడుకోకోకుండా మేము భవనాలను అడిగితే నిరాకరించడం తెలంగాణపట్ల సంకుచిత ధోరణి కాదా? 
  • హైదరాబాద్‌ ఆస్తుల్లో వాటా అడగటం దురాశ కాదా? నిజాం నవాబుల కాలంలో కట్టిన చారిత్రక కట్టడాల్లోనూ వాటా కోరడం మీ దుర్నీతికి నిదర్శనం కాదా? 
  • విభజన మానని గాయం అని అనలేదా? ఇదే మాటను గవర్నర్‌ ప్రసంగంలో చెప్పించి మీ కసి తీర్చుకోలేదా?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement