గోరంట్ల మాధవ్, నిమ్మల కిష్టప్ప
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం.. ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెంట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప పోటీచేస్తుండగా వైఎస్సార్‌సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు.
హిందూపురం తొలి ఎన్నికల్లో పెనుకొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేది. 1957లో ఆ స్థానంలో హిందూపురం అవిర్భవించింది. 1952 ఎన్నికల్లో కేఎంపీపీ అభ్యర్థి కేఎస్ రాఘవాచారిఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత హిందూపురం స్థానానికి 15సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), టీడీపీలు ఐదేసి సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచాక లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలుపొందారు. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. కిష్టప్ప వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
టీడీపీకి ఎదురుగాలి..
పెచ్చుమీరిన విభేదాలతో టీడీపీ బలహీనపడింది. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కిష్టప్పకు తీవ్ర విభేదాలున్నాయి. ఎంపీ నుంచి గెలవడం కష్టమని భావించి ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నించగా కుదర్లేదు. మరోవైపు ఈ పార్లమెంటరీ పరిధిలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అయితే టీడీపీ ఒక్క సీటు కూడా మైనారిటీలకు కేటాయించలేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ వైఎస్సార్ సీపీలో చేరారు. బాలయ్యపై రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ బరిలోకి దిగారు. రాప్తాడులో మంత్రి సునీత కుటుంబ‘సామంత పాలన’పై తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే వరదాపురం వ్యవహారంతో టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ధర్మవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూసుకుపోతున్నారు. మడకశిరలో టీడీపీ తరఫున ఈరన్న, వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
వైఎస్ హయాంలో లేపాక్షి హబ్..
దివంగత సీఎం వైఎస్ హిందూపురం సమీపంలో ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇందులోని పరిశ్రమలకు నీరందించేందుకు
సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 25 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏఒక్క సంస్థ పురోగతికి పాటు పడలేదు. పెద్ద పెద్ద సంస్థలంటూ శంకుస్థాపనలకే పరిమితం చేశారు.
గోరంట్ల మాధవ్
సానుకూలతలు : పోలీసు అధికారిగా మంచి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న కురుబ సామాజికవర్గం నేత కావడం. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండడం. టీడీపీ అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియడం.
నిమ్మల కిష్టప్ప
సానుకూలతలు : రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం.. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం
వ్యతిరేకతలు: రెండు మార్లు ఎంపీగా చేసినప్పటికీ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ప్రజల్లో బలంగా ఉంది. అలాగే నేతల అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి
రిక్తహస్తం చూపడం.
– మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment