nimmala kishtappa
-
ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో నిమ్మల క్రిష్టప్ప
-
హిందూపురం: నిమ్మల వర్సెస్ అంబికా..
సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎవరిని బరిలో దింపాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ సామాజిక వర్గాల నుంచి పలువురు హిందూపురం పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరికి వారు టీడీపీ పెద్దలను కలిసి లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. అయితే వీరిలో ఎవరిని బరిలో దింపినా...మిగతా వారితో ఇబ్బందే అన్న ఆలోచనతో టీడీపీ అధిష్టానం పునరాలోచిస్తోంది. హిందూపురం పార్లమెంటులో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, సొంత కేడర్ లేని వ్యక్తికి టికెట్ ఇస్తే అంతేసంగతులని ఆశావహులు అధిష్టానం వద్ద తమ అభిప్రాయం తెలిపినట్లు సమాచారం. అందరి పరిస్థితీ అంతంతే.. హిందూపురం పార్లమెంటు సీటుకు టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ సొంత ఓటు బ్యాంకు లేదు. ప్రతి ఒక్కరూ పార్టీ బలంపై ఆధారపడాల్సిన పరిస్థితి. కనీసం వారి కులాల నుంచి కూడా సరైన మద్దతు లేదనేది స్పష్టం అవుతోంది. ఆయా కులాల ఓటు బ్యాంకు టీడీపీ కంటే వైఎస్సార్సీపీకే బలంగా ఉండటం విశేషం. వైఎస్సార్ సీపీ గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు బీసీలకే ఇవ్వగా, ఈ సారి టీడీపీ తరఫున బోయ, కురుబ, చేనేత సామాజిక వర్గాల నేతలు హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. అయితే ఆయా కులాలకు వైఎస్సార్సీపీ ఎనలేని గుర్తింపు ఇచ్చింది. నామినేటెడ్ పదవులతో పాటు రాజ్యాధికారం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల నుంచి ఒకరిద్దరు నాయకులు తప్ప ఓటర్లు ఎవరూ టీడీపీ వైపు మొగ్గుచూపడం లేదని అధిష్టానికి తెలిసిపోయింది. దీంతో వారికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ఒకటికి పదిసార్లు రహస్యంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నిమ్మల వర్సెస్ అంబికా.. 2009లో కాంగ్రెస్ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అంబికా లక్ష్మీనారాయణ ఆ తర్వాత టీడీపీలో చేరారు. అయితే టీడీపీ ఆయనకు ఇప్పటివరకు ఒకసారి కూడా టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన హిందూపురం ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. బోయ సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణకు సొంత కులంలో బలం లేదని సమాచారం. మరోవైపు బోయ సామాజిక వర్గంలో చాలా మంది వైఎస్సార్ సీపీ వెంట నడుస్తుండటం తెలిసిందే. ఇక నేసే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎంపీ సీటుకు మరోసారి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. లేదంటే తనకు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను అధిష్టానం ముందు ఉంచినట్లు తెలిసింది. నిమ్మల కూడా ఆ సామాజిక వర్గంలో పెద్దగా ప్రభావం చూపించలేరని కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. రేసులో మరికొందరు.. హిందూపురం ఎంపీ స్థానం నుంచి అంబికా, నిమ్మలతో పాటు పుట్టపర్తికి చెందిన సామకోటి ఆదినారాయణ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు పెనుకొండ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోతే కనీసం ఎంపీ సీటైనా ఇవ్వాలని ఇటు సవితమ్మ అటు బీకే పార్థసారథి కోరుతున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం నుంచి ఎవరికీ హామీ దక్కలేదని సమాచారం. బీసీ కులాల నుంచి సమర్థుడు దొరకడం లేదని పార్టీ పెద్దలు చర్చించుకున్నట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. వెంటాడుతున్న ఓటమి భయం.. ఓటమి భయంతో కొందరు టీడీపీ నేతలు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. టికెట్ రేసులో ఉన్నవారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరోవర్గం అసమ్మతి వ్యక్తం చేయడం ఖాయంగా చెబుతున్నారు. గ్రూపు రాజకీయాలతో పోటీలో ఉన్న వారు బలి కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పురం’ ఎంపీ స్థానం నుంచి ఎవరిని బరిలో నిలపాలన్నది టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. -
‘నిమ్మలకు ఇది తెలియకపోవడం సిగ్గుచేటు’
సాక్షి, విజయవాడ : టీడీపీ నేత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పపై ఎమ్మెల్సీ పోతుల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. నేతన్నలకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎవ్వరు సరిలేరని తెలిపారు. ఏడాది కాలంలో చేనేత రంగంపై సీఎం వైఎస్ జగన్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో చేనేతలకు మొండి చేయి చూపించారని విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేనేతలకు 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. చేనేత రంగానికి ఎవరు ఎంత సహాయం చేశారనే అంశంపై చర్చకు సిద్ధమని సునీత సవాలు విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హ్యాంక్ యార్న్‌పై సబ్సిడీ ప్రవేశపెట్టారని.. దానిని సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీగా పనిచేసిన నిమ్మల కిష్టప్పకు ఇది కూడా తెలియకపోవడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. -
ఈ పురం ఎవరికి వరం
హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం.. ఎన్నికలంటేనే రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఈ సిగ్మెంట్ పరిధిలో ఉన్నహిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ఆయన కుమారుడు బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ తరఫున నిమ్మల కిష్టప్ప పోటీచేస్తుండగా వైఎస్సార్సీపీ నుంచి గోరంట్ల మాధవ్ బరిలో దిగారు. హిందూపురం తొలి ఎన్నికల్లో పెనుకొండ పార్లమెంటరీ నియోజకవర్గంగా ఉండేది. 1957లో ఆ స్థానంలో హిందూపురం అవిర్భవించింది. 1952 ఎన్నికల్లో కేఎంపీపీ అభ్యర్థి కేఎస్ రాఘవాచారిఇక్కడ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత హిందూపురం స్థానానికి 15సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), టీడీపీలు ఐదేసి సార్లు గెలుపొందాయి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఇక్కడి నుంచి గెలిచాక లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఈ నియోజకవర్గం పరిధిలో రాప్తాడు, మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప గెలుపొందారు. ఇక్కడ వరుసగా మూడోసారి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన సందర్భం లేదు. కిష్టప్ప వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. టీడీపీకి ఎదురుగాలి.. పెచ్చుమీరిన విభేదాలతో టీడీపీ బలహీనపడింది. పెనుకొండలో ఎమ్మెల్యే బీకే పార్థసారథితో కిష్టప్పకు తీవ్ర విభేదాలున్నాయి. ఎంపీ నుంచి గెలవడం కష్టమని భావించి ఇప్పటికే అసెంబ్లీకి వెళ్లాలని ప్రయత్నించగా కుదర్లేదు. మరోవైపు ఈ పార్లమెంటరీ పరిధిలో మైనారిటీల ఓట్లు ఎక్కువ. అయితే టీడీపీ ఒక్క సీటు కూడా మైనారిటీలకు కేటాయించలేదు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ శ్రీధర్‌రెడ్డి దూసుకుపోతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గ బాగోగులను పూర్తిగా విస్మరించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ఘనీ వైఎస్సార్ సీపీలో చేరారు. బాలయ్యపై రిటైర్డ్ ఐజీ ఇక్బాల్ బరిలోకి దిగారు. రాప్తాడులో మంత్రి సునీత కుటుంబ‘సామంత పాలన’పై తీర్పు ఇచ్చేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. ధర్మవరంలో ఎమ్మెల్యే వరదాపురం వ్యవహారంతో టీడీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్న ధర్మవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేతిరెడ్డి దూసుకుపోతున్నారు. మడకశిరలో టీడీపీ తరఫున ఈరన్న, వైఎస్సార్ సీపీ తరఫున డాక్టర్ తిప్పేస్వామి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్ హయాంలో లేపాక్షి హబ్.. దివంగత సీఎం వైఎస్ హిందూపురం సమీపంలో ‘లేపాక్షి నాలెడ్జ్ హబ్’ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పలు బహుళజాతి సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఇందులోని పరిశ్రమలకు నీరందించేందుకు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి పైపులైన్ నిర్మాణం చేపట్టారు. 25 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏఒక్క సంస్థ పురోగతికి పాటు పడలేదు. పెద్ద పెద్ద సంస్థలంటూ శంకుస్థాపనలకే పరిమితం చేశారు. గోరంట్ల మాధవ్ సానుకూలతలు : పోలీసు అధికారిగా మంచి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు పార్లమెంట్ పరిధిలో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న కురుబ సామాజికవర్గం నేత కావడం. జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడం. టీడీపీ అవినీతి, అక్రమాలు ప్రజలకు తెలియడం. నిమ్మల కిష్టప్ప సానుకూలతలు : రెండు సార్లు ఎంపీగా చేసిన అనుభవం.. ఆర్థికంగా అండదండలు అందించే అనుచరగణం వ్యతిరేకతలు: రెండు మార్లు ఎంపీగా చేసినప్పటికీ ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ప్రజల్లో బలంగా ఉంది. అలాగే నేతల అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోయాయి చేనేత రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రిక్తహస్తం చూపడం. – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
కిష్టప్పా.. ఇదేందప్ప!
అభివృద్ధి చేస్తానంటూ ఊరిని దత్తతకు తీసుకుంటివి చుట్టపు చూపుగా కూడా రాకపోతివి గ్రామ రూపురేఖలు మారుస్తానంటివి రెండేళ్లుగా కనిపించకుండా పోతివి సోమఘట్ట వాసుల ఆవేదన హిందూపురం అర్బన్: ‘ఉట్టికెగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరిందంట’ అన్న చందంగా మారింది హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తీరు. తాను పుట్టి పెరిగిన మండలాన్ని అభివృద్ధి చేయలేని ఆయన.. దత్తత పేరుతో తీసుకున్న గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో గోరంట్ల మండల వాసుల దాహార్తిని తీర్చలేకపోయారు. మండలాధ్యక్షుడిగాను, ఎమ్మెల్యేగాను, ఎంపీగాను బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. తాను రైతు బిడ్డగా చెప్పుకుంటున్న నిమ్మల కిష్టప్పకు గ్రామీణ ప్రాంతాల దుస్థితిపై పూర్తి అవగాహన ఉంది. ఆయన అనుకుంటే గ్రామీణ ప్రాంత రూపురేఖలు మార్చగలరు. తన కోటా నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచేందుకు అవకాశముంది. అయినా ఆయనకు అవేమీ పట్టవు. ఆఖరుకు చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం దత్తతకు తీసుకున్న ఆయన.. తర్వాత ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మలంగా ఉండిపోయారు. లోకసభ నియోజకవర్గం: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు : నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్న గ్రామం : సోమఘట్ట, చిలమత్తూరు మండలం గ్రామంలోని గడపలు : 470 గ్రామ జనాభా : 1,200 హిందూపురం లోకసభ నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం సోమఘట్ట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ రెండేళ్ల క్రితం ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. గ్రామ రూపురేఖలు మార్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానంటూ గ్రామస్తులకు అప్పట్లో ఆయన నమ్మబలికారు. అయితే ఈ రెండేళ్లలో ఆ గ్రామం ఇసుమంతైనా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయి. గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేదు. అసలు గ్రామానికి రహదారి కూడా సక్రమంగా లేదు. గ్రామంలోకి నేటికీ ఎర్రబస్సు వెళ్లదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణమంటే ఆటోలే దిక్కు. డ్రెయినేజీ వ్యవస్థ లేదు. గ్రామం మధ్యలోనే మురుగు నీటి నిల్వలు పేరుకుపోయాయి. దోమలు, పందుల బెడదతో రోగాలు ప్రబలుతున్నాయి. ఇక తాగునీటి కోసం గ్రామీణులు పడే ఇక్కట్లు చెప్పనలవి కాదు. ఉపాధి పనులు లేవు. వ్యవసాయం అంతంత మాత్రమే. పాడి పోషణకు ప్రోత్సాహం కరువైంది.. ప్రభుత్వం మంజూరు చేస్తున్న సొంతిల్లు కలగానే మిగిలిపోయింది. గ్రామంలోని ప్రధాన సమస్యలివే – సోమఘట్టలోని బీసీ, ఎస్సీ ఇతర కాలనీలకు కనీస రోడ్డు సదుపాయం లేదు. – గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఎక్కడిపడితే అక్కడ మురుగునీరు నిలిచిపోయింది. దుర్గంధం వ్యాపిస్తోంది. – తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం స్థానికులు వ్యవసాయ బోరు బావులపై ఆధారపడ్డారు. – పశు ఉపవైద్యశాల లేకపోవడంతో పాడి రైతులు పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతంలోని పశువైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. – గ్రామానికి సరైన బస్సు సౌకర్యం లేదు. – పంచాయతీ కార్యాలయం పక్కన మరుగుదొడ్డి నిర్మాణం కోసం వేసిన పునాది దీర్ఘకాలంగా అలాగే ఉండిపోయింది. – పెద్ద చెరువు, చిన్న చెరువులకు వెళ్లే దారులు సరిగా లేకపోవడంతో అటుగా ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సమస్య తీరలేదు గ్రామంలో బోలెడు సమస్యలు ఉన్నాయి. తాగునీరు అందడం లేదు. నీటి కోసం పాలాల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. - డి.చిన్నప్ప, సోమఘట్ట, చిలమత్తూరు మండలం మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చారు మా గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ నిమ్మల కిష్టప్ప దత్తతకు తీసుకున్నారు. రోడ్లు వేస్తానన్నారు. మురికి కాలులు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇంకా అదీ చేస్తాను.. ఇది చేస్తాను అని చెప్పారు. ఇయన్నీ చెప్పినాయన ఇటుగా వచ్చింది లేదు. ఎంపీ గెలిచిన ఈ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే వచ్చి వెళ్లారు. మా ఊరిని పట్టించుకునే వారే కరువయ్యారు. - శ్రీనివాసులు, సోమఘట్ట, చిలమత్తూరు మండలం. -
గూండాగిరి
- శ్రుతిమించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల ఆగడాలు - ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, దాడులు - బాగేపల్లి టోల్‌ప్లాజాలో నిమ్మల తనయుల వీరంగం - టోల్‌ఫీజు అడిగినందుకు సిబ్బందిపై దాడి - కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం - టోల్‌ప్లాజాపై దాడి చేయడం ఇది మూడోసారి హిందూపురం అర్బన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. ప్రజాప్రతినిధులు మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకు దౌర్జన్యాలు, దాడులకు దిగడం అలవాటుగా చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. న్యాయాన్యాయాలతో పనిలేకుండా వారిపై అమాంతం దాడులకు తెగబడుతున్నారు. సోమవారం టోల్‌ఫీజు అడిగారన్న కోపంతో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ తమ అనుచరులతో కలిసి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో నానా బీభత్సం సృష్టించారు. సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా అక్కడి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతపురం–బెంగళూరు మార్గంలోని 44వ జాతీయ రహదారిలో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగడం ఇదేమీ కొత్త కాదు. సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. టోల్‌ప్లాజాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు, కొందరు అధికారులు, ప్రముఖులకు మాత్రమే ఉచిత వాహన ప్రవేశ అనుమతి ఉంటుంది. మిగిలిన వారు తప్పనిసరిగా టోల్‌ఫీజు చెల్లించాలి. అయితే.. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు తమ వారి పాస్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. తమ వాహనాలను ఉచితంగా అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల గురించి టోల్‌ప్లాజా సిబ్బంది వారికి చెప్పినా..ఏమాత్రం వినకుండా గొడవకు దిగుతున్నారు. నిమ్మల కిష్టప్ప పెద్ద కుమారుడు అంబరీష్ కూడా ఇదేవిధంగా గొడవకు దిగాడు. అతని ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)ను టోల్‌ప్లాజా సిబ్బంది అనుమతించినప్పటికీ సంతృప్తి చెందకుండా.. అతని స్నేహితులు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు(ఏపీ02 ఈబీ 6777)ను కూడా ఉచితంగా అనుమతించాలని డిమాండ్ చేశాడు. వారు వినకపోవడంతో తన తమ్ముడు నిమ్మల శిరీష్, కొంతమంది అనుచరులను అక్కడికి పిలిపించుకుని.. అందరూ కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేశారు. ఈ దాడిలో ప్లాజా ఉద్యోగి నటరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. టోల్‌ఫీజులు నమోదు చేసే కంప్యూటర్లు, పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి బాగేపల్లి పోలీసులు నిమ్మల కిష్టప్ప కుమారులతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నిమ్మల కుటుంబ సభ్యులు బాగేపల్లి టోల్‌ప్లాజాలో దౌర్జన్యానికి దిగడం ఇది మూడోసారి. దీంతో వారి పేరు వినగానే అక్కడి సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎంపీ సోదరుడు నిమ్మల చంద్రశేఖర్ టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరు చెప్పి తన వాహనాన్ని అనుమతించాలని కోరగా..అందుకు ప్లాజా సిబ్బంది నిరాకరించడంతో వివాదం తలెత్తింది. 2015 ఏప్రిల్ 5న ఎంపీ కుమారుడు అంబరీష్ కొత్తకారులో వస్తుండగా ప్లాజా సిబ్బంది నిలిపారు. దీనికి ఆగ్రహించిన ఎంపీ నిమ్మలకిష్టప్ప నేరుగా అక్కడి చేరుకుని సిబ్బందితో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనపై నిమ్మల కిష్టప్పతో పాటు మరికొందరిపై కేసు నమోదయ్యింది. అయితే.. అప్పటి ప్లాజా మేనేజర్ ఈ కేసును వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు ఎంపీ అనుచరుడు సుబ్బారెడ్డి కూడా ప్లాజా సిబ్బందితో గొడవ పడినట్లు సమాచారం. మూడోసారి కూడా నిమ్మల కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని కర్ణాటక పోలీసులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులై ఉండి.. ఇలా దాడులు చేయడం సరికాదని చిక్‌బళ్లాపూర్ (కర్ణాటక) ఎస్పీ కార్తీక్‌రెడ్డి హితవుచెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యులు గూండాల్లో ప్రవర్తిస్తున్నారంటూ టోల్‌ప్లాజా డైరెక్టర్ ఉదయ్కుమార్సింగ్ కాస్తంత కఠినంగానే మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని, కొందరు రాజకీయ నేతల కారణంగా తమకు భద్రత కరువైందని టోల్‌ప్లాజా సిబ్బంది వాపోయారు. తనపై ఎంపీ తనయులు దాడి చేయడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని నటరాజ్ అనే ఉద్యోగి తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఎంపీ కిష్టప్ప కుమారులపై కేసు నమోదు
-
హిందూపురం ఎంపీ వర్గీయుల దౌర్జన్యం
-
టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎంపీ కుమారుడి దౌర్జన్యం
అనంతపురం: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టోల్గేట్ వద్ద సిబ్బంది టోల్ ఫీజు అడిగిన పాపానికి నానా బీభత్సం సృష్టించారు. బాగేపల్లి టోల్గేట్ వద్ద ఎంపీ నిమ్మల కిష్టప్ప వర్గీయులను సిబ్బంది టోల్ ఫీజు అడిగారు. దీంతో ఆగ్రహించిన వారు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడటంతో పాటు.. అద్దాలు, కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్వయంగా ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ ఈ దాడికి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఎంపీలకు మినహాయింపు ఉంటుంది కానీ.. వారి తనయులకు టోల్ ఫీజు విషయంలో మినహాయింపు ఉండదని సిబ్బంది చెప్పడమే కిష్టప్ప వర్గీయుల ఆగ్రహానికి కారణమైనట్లుగా తెలుస్తోంది. -
ఎంపీ కుమారుల భూమి రిజిస్ట్రేషన్ రద్దు
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ శశిధర్ స్పందించారు. రికార్డులు తారుమారు చేసిన బూదిలి గ్రామ వీఆర్ఓ నరసింహమూర్తిని సస్పెండ్ చేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారులు చేయించిన భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధితులకే భూములు అప్పగిస్తూ కలెక్టర్ శశిధర్ ఉత్తర్వులు ఇచ్చారు. (చదవండి - నిమ్మల భూ కిరికిరి) బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తన వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. -
నిమ్మల భూ కిరికిరికి రెవెన్యూ చెక్
గోరంట్ల : హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అక్ర మ మార్గంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నించిన భూమిని రెవెన్యూ అధికారులు తిరిగి బాధిత రైతు మల్లేశప్ప పేరిట అడంగల్‌లో నమోదు చేయించారు. ‘ నిమ్మల భూ కిరికిరి’ శీర్షికన 15 వతేదీ సాక్షిలో వార్తాకథనం ప్రచురితమైన విషయం విదితమే. అలాగే బాధిత రైతు మల్లేశప్ప జిల్లా కలెక్టర్, ఎస్పీని మీ కోసం కార్యక్రమంలో కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 18న స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 2011లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు బాధిత రైతు మల్లేశప్ప తహశీల్దార్ ఎదుట హాజరై తమ వాంగ్మూలంతో పాటు భూములకు సంబంధించిన పక్కా రికార్డులను సమర్పించారు. ఈ మేరకు ఆమె పంపిన నివేదిక ఆధారంగా మల్లేశప్ప పేరిట అడంగల్ ను య«థాస్థానంలో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారని స్థానిక తహశీల్దార్ హసీనాసుల్తానా సాక్షికి ఫోన్ ద్వారా తెలిపారు. -
నిమ్మల భూ కిరికిరి
– పేద రైతుకు చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు – అన్ని విధాలా సహకరించిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు – లబోదిబోమంటున్న బాధితుడు –––––––––––––––––––––––––– ఈ భూమి గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 476లో ఉంది. మొత్తం విస్తీర్ణం 13.30 ఎకరాలు. 44వ జాతీయ రహదారికి ఆనుకునే ఉంది. దీంతో ఎకరా ఎంతలేదన్నా రూ.25 లక్షలకు పైమాటే. గతంలో ఈ భూమితో పాటు మిగిలిన భూములనూ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) కోసం సేకరించారు. అయితే.. పట్టా భూమి అని తేలడంతో రెవెన్యూ అధికారులు సెజ్ పరిధి నుంచి తప్పించారు. ఆ తర్వాత లొసుగులను ఆధారంగా చేసుకుని అధికార పార్టీకి చెందిన హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయులు నిమ్మల శిరీష్, అంబరీష్ తమ వశం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. రెవెన్యూ అధికారుల సహకారంతో భూముల రికార్డులనే మార్చి.. ఇందులోని 4.66 ఎకరాలను రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నం: 3761/16) చేయించుకున్నారు. గోరంట్ల : గోరంట్ల మండలంలో ఇటీవల భూ అక్రమాలు పెరిగిపోతున్నాయి. పేదల అమాయకత్వాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారు. ఈ అక్రమాల్లో ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లు తేలడం గమనార్హం. గోరంట్ల మండలం బూదిలి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 476లో ఉన్న 13.30 ఎకరాల భూమిని 1920వ సంవత్సరంలో తమ్మినాయనిపల్లికి చెందిన వడ్డే సుంకుడు అనే వ్యక్తికి ప్రభుత్వం పంపిణీ చేసింది. తదనంతరం అతని కుమారుడైన వడ్డే సుంకన్న అలియాస్ ఎద్దుల ఆయప్పకు సంక్రమించింది. అతను అదే గ్రామానికి చెందిన∙కుమ్మర మల్లయ్య, కుమ్మర ఈరన్నలకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నంబర్లు 263/1973, 264/1973. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటూ ఉండేవారు. అయితే.. 2011లో ఇందులోని 8.64 ఎకరాల భూమిని గోరంట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు చెన్నకష్ణారెడ్డి, ధర్మవరం పట్టణానికి చెందిన కదిరప్ప కలిసి కొనుగోలు చేశారు. మరో 1.33 ఎకరాలను కదిరప్ప ఒక్కరే కొన్నారు. మిగిలిన 3.33 ఎకరాలను కుమ్మర మల్లయ్య రెండో భార్య మల్లక్క కుమారుడు మల్లేశప్ప సాగు చేస్తున్నాడు. 2013లో పట్టాదారు పాసుపుస్తకాన్ని (1బీ నంబర్ 2579) కూడా పొందారు. ఆ తర్వాత వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేయించుకున్నారు. ఆర్డీఓ కోర్టు తీర్పూ వారి పక్షమే.. బూదిలి, వడిగేపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని 5,733.60 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ భూములను ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) కోసం సేకరించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ (కర్నూలు) కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌కు 2008 మే 30న లేఖ (ఆర్సీ నంబర్ : జెడ్ఓ/ఏపీఐఐసీ–కేఎన్ఎల్/ఐపీ 2277/08) వచ్చింది. 476 సర్వేనంబర్‌లోని 13.30 ఎకరాలు పట్టా భూమిగా గుర్తించి..భూసేకరణ నుంచి మినహాయించారు. అయితే.. 2014లో అప్పటి తహశీల్దార్ ఈ భూమి కూడా ప్రభుత్వానిదేనని, స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీనిపై భూమిని కొనుగోలు చేసిన చెన్నకష్ణారెడ్డి, కదిరప్పతో పాటు అనుభవంలో ఉన్న మల్లేశప్ప ఆర్డీఓ కోర్టులో అప్పీలు చేశారు. ఈ భూమి వారికే చెందుతుందని ఆర్డీఓ కోర్టు 2015 జూలై 22న తీర్పు ఇచ్చింది. ‘నిమ్మల’ంగా ఏమార్చారు! కదిరప్ప కొన్న 1.33 ఎకరాలు, మల్లేశప్ప ఆధీనంలోని 3.33 ఎకరాలు కలిపి మొత్తం 4.66 ఎకరాల భూమి చుట్టూ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు రాళ్లు పాతించారు. దీన్ని గమనించిన బాధిత రైతుతో పాటు భూమిని కొన్న వ్యక్తులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత నెల 30న వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించగా సుంకన్న అలియాస్ ఎద్దుల ఆయప్ప భార్య అంజినమ్మ పేరిట వివరాలు నమోదై ఉన్నాయి. అలాగే ఈ నెల ఒకటిన ఎంపీ తనయులు నిమ్మల శిరీష్ , అంబరీష్ చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 3761/2016) పొందారు. ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా సెక్షన్ 22(ఏ) అనెగ్జర్ 5 కిందకు వచ్చే ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టర్ ఎన్ఓసీ అవసరం. అయినప్పటికీ చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసేశారు. తహశీల్దార్ ఏమంటున్నారంటే.. రిజిస్ట్రేషన్ విషయం తన దష్టికి రాలేదని గోరంట్ల తహసీల్దార్ హసీనా సుల్తాన్ చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం సంబంధిత వీఆర్ఓ నమోదు చేశారని, అతనిపై శాఖ పరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు. మరి డిజిటల్ కీ మీరేలా ఇచ్చారని అడగ్గా.. ఆమె సమాధానం దాటవేశారు. న్యాయం చేయాలి భూములను కాపాడాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులకు అనుకూలంగా వ్యవహరించడంతో నాకు అన్యాయం జరిగింది. నా 3.33 ఎకరాల భూమిని మరొకరి పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి..వారి నుంచి ఎంపీ తనయులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎంపీ స్థాయి వారితో సామాన్యుణ్ని ఏవిధంగా పోరాడగలను?! అధికారుల నిర్వాకం వల్ల మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. – మల్లేశప్ప, బాధిత రైతు -
'చేనేతను ఆదుకుంటాం'
విశాఖపట్టణం: చితికిపోయిన చేనేతను అన్ని విధాలా ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా కసింకోటలోని చేనేత కార్మికుల స్థితిగతులను పరిశీలించేందుకు ఆయన బుధవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ.3 లక్షల రూపాయలతో వర్కింగ్ షెడ్డు, ఇల్లు నిర్మించి ఇస్తామని, 400 కోట్లతో జనతా వస్త్రాల పథకం అమలు చేస్తామని చెప్పారు. అలాగే చేనేతలు తీసుకున్న రూ.169 కోట్ల వ్యక్తిగత రుణాలను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్-8 అమలు చేయించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. -
నిమ్మలంగా దోపిడీ
ఎంపీ ల్యాడ్స్ హాంఫట్! ప్రతిపాదించిన పనుల్లో అధిక శాతం బినామీ పేర్లతో చేసిన వైనం బినామీ సంస్థతో తాగునీటి బోరు బావుల తవ్వకం సాక్షి ప్రతినిధి, అనంతపురం : లోక్‌సభ సభ్యుడి హోదాలో పనులన్నీ ఆయనే ప్రతిపాదించారు. వాటిని చేపట్టేలా తక్షణమే పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఆ పనులను బినామీ పేర్లతో ఆయనే నాసిరకంగా చేపట్టి నిధులను దోచుకున్నారు. ఇదీ ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తీరు. వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. పార్లమెంటు సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ పథకం కింద 2010-11 వరకూ ఏటా రూ.2 కోట్ల మేర మంజూరు చేసేవారు. 2011-12 నుంచి ఎంపీ ల్యాడ్స్ నిధులను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు. ఎంపీ ల్యాడ్స్ కింద ఏ ఏ పనులను చేపట్టాలన్నది సంబంధిత ఎంపీ ప్రతిపాదనలు చేస్తారు. ఆ పథకం అమలును పర్యవేక్షించే అధికారి.. ఎంపీ ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత పనులు చేపట్టేలా పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తారు. ఎంపీ ల్యాడ్స్ కింద చేపట్టే పనుల్లో రూ.2 లక్షల్లోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయి అధికారి, రూ.5 లక్షల్లోపు విలువైన పనులను సూపరింటెండెంట్ ఇంజనీరు స్థాయి అధికారి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి పనులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.5 లక్షలకన్నా అధిక వ్యయంతో చేపట్టే పనులకు కచ్చితంగా టెండర్లు నిర్వహించాల్సిందే. నిబంధనల్లో లొసుగులతో ఎంపీ నిమ్మల సొమ్ము చేసుకున్నారు. ఏ ఒక్క పని విలువ కూడా రూ.5 లక్షలకన్నా అధికంగా ఉండకుండా చూసుకున్నారు. ఆ మేరకు పనులను చేపట్టేలా ప్రతిపాదనలు చేసి.. వాటిని కనీసం టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వకుండా బినామీ పేర్లతో తానే చేపట్టారు. పనులను నాసిరకంగా పూర్తి చేసి.. బిల్లుల రూపంలో కోట్లాది రూపాయాలను నొక్కేశారు. నిమ్మలా.. మజాకా! ఐదేళ్లలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కోటా కింద ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.19 కోట్లు మంజూరయ్యాయి. విడుదలైన నిధులకన్నా అధికంగా రూ.20.59 కోట్లతో 1273 పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. నిధులున్నాయా లేదా అనే అంశాన్ని పట్టించుకోకుండా నిమ్మల ఒత్తిడి మేరకు.. ఆ పథకాన్ని పర్యవేక్షించే డ్వామా (జిల్లా నీటియాజమాన్య సంస్థ) పీడీ సంజయ్ ప్రభాకర్ పనులను మంజూరు చేశారు. ఈ పనుల్లో ఇద్దరు ముగ్గురికి మినహా టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల బాహాటంగా విమర్శించారు. అధిక శాతం పనులను బినామీ పేర్లతో చేపట్టి.. నాసిరకంగా పనులను పూర్తిచేసి నిధులను దోచుకున్నారని ఆ ఎమ్మెల్యేనే ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో విమర్శించడం సంచలనం రేపింది. ఎంపీ నిమ్మల సొంతూరైన గోరంట్లలో సింగిరెడ్డిపల్లి సర్కిల్ నుంచి మార్కెట్ యార్డు వరకూ రూ.10 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మించాలని 2010-11లో ప్రతిపాదించారు. ఈ పనులను రెండు భాగాలుగా విడగొట్టి.. నామినేషన్ పద్ధతిలో బినామీ పేర్లతో ఎంపీ నిమ్మల కిష్టప్పే చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలి నాసిరకంగా పనులను పూర్తి చేసి.. బిల్లులు నొక్కేశారు. ఫలితంగా మూడేళ్లకే సిమెంటు రోడ్డు శిథిలమైపోవడాన్ని చూసి గోరంట్ల ప్రజానీకం మండిపడుతున్నారు. నిబంధనలకు నీళ్లు ఎంపీ నిమ్మల ఐదేళ్లలో 466 బోరు బావులను తవ్వించి.. మోటార్లు బిగించి, తాగునీటిని సరఫరా చేయడానికి రూ.4.29 కోట్లను ఖర్చు చేశారు. తాగునీటి బోరు బావుల తవ్వకం పనులను నిబంధనల ప్రకారం రిజిష్టర్ సంస్థకే అప్పగించాలి. కానీ.. ఎంపీ నిమ్మల మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. తన బినామీలకు చెందిన కేపీఎస్ వినాయక బోర్‌వెల్స్ అనే సంస్థకు బోరు బావుల తవ్వకం పనులను అప్పగించారు. బోరు బావిని తక్కువ లోతు తవ్వినా ఎక్కువ లోతుకు తవ్వినట్లు రికార్డులు సృష్టించి, ప్రజాధనాన్ని దోచుకున్నారు. తాగునీటి బోరు బావులకు మోటార్లు బిగించడం, పైపులైను వేయడం పనుల్లోనూ ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించినట్లు టీడీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎంపీ నిమ్మల తనయుడి వివాహం నవంబర్ 7, 2013న గోరంట్లలోని ఆయన పొలంలో ఘనంగా చేశారు. ఈ వివాహ వేడుకలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద రూ.92,939 కరెంట్ లైన్‌ను వేయించడాన్ని బట్టి చూస్తే నిమ్మల కిష్టప్ప ఏ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోంది. -
'నిమ్మల కిష్టప్ప.. గో బ్యాక్'
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిచెరువు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో హిందూపురం లోక్‌సభ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను ఘెరావ్ చేశారు. ఎమ్మెల్సీ రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో కిష్టప్పపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ నిమ్మల కిష్టప్ప గో బ్యాక్.. అంటూ నినాదాలు చేశారు. ప్రజలకు అవసరమైన పనులు చేయడంలో ఎంపీగా విఫలమయ్యారని మండిపడుతూ ఈ సందర్భంగా కార్యకర్తలు తోపులాటకు దిగారు. ఇంతలో ఆయనకు అనుకూలంగా ఉండే ఓ కార్యకర్త నిమ్మల కిష్టప్ప జిందాబాద్ అనడంతో రెండు వర్గాల మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.