నిమ్మలంగా దోపిడీ
- ఎంపీ ల్యాడ్స్ హాంఫట్!
- ప్రతిపాదించిన పనుల్లో అధిక శాతం బినామీ పేర్లతో చేసిన వైనం
- బినామీ సంస్థతో తాగునీటి బోరు బావుల తవ్వకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : లోక్‌సభ సభ్యుడి హోదాలో పనులన్నీ ఆయనే ప్రతిపాదించారు. వాటిని చేపట్టేలా తక్షణమే పరిపాలన పరమైన అనుమతులు జారీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఆ పనులను బినామీ పేర్లతో ఆయనే నాసిరకంగా చేపట్టి నిధులను దోచుకున్నారు. ఇదీ ఎంపీ ల్యాడ్స్ వినియోగంలో హిందూపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తీరు. వివరాల్లోకి వెళితే.. 2009 ఎన్నికల్లో హిందూపురం లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప విజయం సాధించారు. పార్లమెంటు సభ్యులకు ఎంపీ ల్యాడ్స్ పథకం కింద 2010-11 వరకూ ఏటా రూ.2 కోట్ల మేర మంజూరు చేసేవారు. 2011-12 నుంచి ఎంపీ ల్యాడ్స్ నిధులను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచారు.
ఎంపీ ల్యాడ్స్ కింద ఏ ఏ పనులను చేపట్టాలన్నది సంబంధిత ఎంపీ ప్రతిపాదనలు చేస్తారు. ఆ పథకం అమలును పర్యవేక్షించే అధికారి.. ఎంపీ ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత పనులు చేపట్టేలా పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తారు. ఎంపీ ల్యాడ్స్ కింద చేపట్టే పనుల్లో రూ.2 లక్షల్లోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు స్థాయి అధికారి, రూ.5 లక్షల్లోపు విలువైన పనులను సూపరింటెండెంట్ ఇంజనీరు స్థాయి అధికారి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టే వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి పనులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.5 లక్షలకన్నా అధిక వ్యయంతో చేపట్టే పనులకు కచ్చితంగా టెండర్లు నిర్వహించాల్సిందే. నిబంధనల్లో లొసుగులతో ఎంపీ నిమ్మల సొమ్ము చేసుకున్నారు. ఏ ఒక్క పని విలువ కూడా రూ.5 లక్షలకన్నా అధికంగా ఉండకుండా చూసుకున్నారు. ఆ మేరకు పనులను చేపట్టేలా ప్రతిపాదనలు చేసి.. వాటిని కనీసం టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వకుండా బినామీ పేర్లతో తానే చేపట్టారు. పనులను నాసిరకంగా పూర్తి చేసి.. బిల్లుల రూపంలో కోట్లాది రూపాయాలను నొక్కేశారు.
నిమ్మలా.. మజాకా!
ఐదేళ్లలో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కోటా కింద ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.19 కోట్లు మంజూరయ్యాయి. విడుదలైన నిధులకన్నా అధికంగా రూ.20.59 కోట్లతో 1273 పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందజేశారు. నిధులున్నాయా లేదా అనే అంశాన్ని పట్టించుకోకుండా నిమ్మల ఒత్తిడి మేరకు.. ఆ పథకాన్ని పర్యవేక్షించే డ్వామా (జిల్లా నీటియాజమాన్య సంస్థ) పీడీ సంజయ్ ప్రభాకర్ పనులను మంజూరు చేశారు. ఈ పనుల్లో ఇద్దరు ముగ్గురికి మినహా టీడీపీ కార్యకర్తలకు కూడా నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల బాహాటంగా విమర్శించారు. అధిక శాతం పనులను బినామీ పేర్లతో చేపట్టి.. నాసిరకంగా పనులను పూర్తిచేసి నిధులను దోచుకున్నారని ఆ ఎమ్మెల్యేనే ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో విమర్శించడం సంచలనం రేపింది. ఎంపీ నిమ్మల సొంతూరైన గోరంట్లలో సింగిరెడ్డిపల్లి సర్కిల్ నుంచి మార్కెట్ యార్డు వరకూ రూ.10 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మించాలని 2010-11లో ప్రతిపాదించారు. ఈ పనులను రెండు భాగాలుగా విడగొట్టి.. నామినేషన్ పద్ధతిలో బినామీ పేర్లతో ఎంపీ నిమ్మల కిష్టప్పే చేపట్టారు. నిబంధనలకు నీళ్లొదిలి నాసిరకంగా పనులను పూర్తి చేసి.. బిల్లులు నొక్కేశారు. ఫలితంగా మూడేళ్లకే సిమెంటు రోడ్డు శిథిలమైపోవడాన్ని చూసి గోరంట్ల ప్రజానీకం మండిపడుతున్నారు.
నిబంధనలకు నీళ్లు
ఎంపీ నిమ్మల ఐదేళ్లలో 466 బోరు బావులను తవ్వించి.. మోటార్లు బిగించి, తాగునీటిని సరఫరా చేయడానికి రూ.4.29 కోట్లను ఖర్చు చేశారు. తాగునీటి బోరు బావుల తవ్వకం పనులను నిబంధనల ప్రకారం రిజిష్టర్ సంస్థకే అప్పగించాలి. కానీ.. ఎంపీ నిమ్మల మాత్రం తద్భిన్నంగా వ్యవహరించారు. తన బినామీలకు చెందిన కేపీఎస్ వినాయక బోర్‌వెల్స్ అనే సంస్థకు బోరు బావుల తవ్వకం పనులను అప్పగించారు. బోరు బావిని తక్కువ లోతు తవ్వినా ఎక్కువ లోతుకు తవ్వినట్లు రికార్డులు సృష్టించి, ప్రజాధనాన్ని దోచుకున్నారు. తాగునీటి బోరు బావులకు మోటార్లు బిగించడం, పైపులైను వేయడం పనుల్లోనూ ఇదే రీతిలో చేతివాటం ప్రదర్శించినట్లు టీడీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎంపీ నిమ్మల తనయుడి వివాహం నవంబర్ 7, 2013న గోరంట్లలోని ఆయన పొలంలో ఘనంగా చేశారు. ఈ వివాహ వేడుకలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎంపీ ల్యాడ్స్ కింద రూ.92,939 కరెంట్ లైన్‌ను వేయించడాన్ని బట్టి చూస్తే నిమ్మల కిష్టప్ప ఏ స్థాయిలో నిధులను దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోంది.