ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల | State Wide Protests Over TDP Stance In Legislative Council | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాల

Published Fri, Jan 24 2020 5:23 AM | Last Updated on Fri, Jan 24 2020 8:55 AM

State Wide Protests Over TDP Stance In Legislative Council - Sakshi

సాక్షి: పరిపాలన, అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున నిరసనలు ఎగసిపడ్డాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనేకచోట్ల మానవహారాలు నిర్వహించారు. మరికొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను చెప్పులతో కొట్టి ప్రజలు తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు.  విశాఖ నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున సాగాయి. చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును శాసన మండలిలో కుట్రపూరితంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఎన్‌ఏడీ, మద్దిలపాలెం జంక్షన్లలో పెద్దఎత్తున మానవహారాలు నిర్వహించారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన విశాఖపైనే విషం కక్కుతున్న వెలగపూడి రామకృష్ణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంవీపీ కాలనీలోని ఆయన ఇంటివద్ద బుధవారం రాత్రే ఆందోళనలు మొదలయ్యాయి. గురువారం సాయంత్రం మరోసారి ప్రజలు భారీఎత్తున తరలివెళ్లి ముట్టడించారు. చంద్రబాబు దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. తర్వాత ఆ బొమ్మను దహనం చేశారు. ఇక కొమ్మాది, చోడవరంలో, బుచ్చయ్యపేట మండలం వడ్డాది, రావికమతంలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. రోలుగుంట మండల కేంద్రంలో మానవహారం నిర్వహించారు. నక్కపల్లిలో వైఎస్సార్‌సీపీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనకాపల్లిలో జరిగిన నిరసన ప్రదర్శనలో భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. నర్సాపురంలో వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించి, రాస్తారోకో చేశారు. తణుకు, అత్తిలి, ఇరగవరం, తాడేపల్లిగూడెంలలో చంద్రబాబువి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఎమ్మెల్సీలు ఫరూక్‌ ఆఫీసు, బీటీ నాయుడు ఇల్లు ముట్టడి
కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ బి.సత్యన్న, న్యాయవాదుల జేఏసీ చైర్మన్‌ వై.జయరాజు ఆధ్వర్యంలో భారీఎత్తున ధర్నా నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తంచేశారు. నంద్యాలలో విద్యార్థి సంఘాలు ఎమ్మెల్సీ ఫరూక్‌ కార్యాలయాన్ని ముట్టడించాయి. అనంతరం చంద్రబాబు చిత్రపటాలను, దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదోనిలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇంటిని ముట్టడించి, ఆయన ఇంటి గేటుకు వినతిపత్రాన్ని అంటించి నిరసన తెలిపారు. ఆళ్లగడ్డలో న్యాయవాదులు బైక్‌ ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మిగనూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా పుంగనూరు, నిండ్ర, ఐరాల మండలంలో పార్టీ నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు
ఉత్తరాంధ్ర వెన్నుపోటుదారుడు అచ్చెన్నాయుడు డౌన్‌..డౌన్‌.. అంటూ సాగిన నినాదాలతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మార్మోగింది. అమరావతి భూ మాఫియా కోసం ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగలవద్దని అచ్చెన్న సొంత నియోజకవర్గంలోనే ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. టెక్కలిలో పట్టణ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ ఆధ్వర్యంలో ధర్మపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

హిందూపురంలో అర్ధనగ్న ప్రదర్శన

అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఆదేశాలతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధ నగ్నంగా ర్యాలీ నిర్వహిస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ దిగజారుడు రాజకీయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణ సీమ ద్రోహులని మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘనీ మండిపడ్డారు.

బాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ..

విజయనగరంలో చంద్రబాబు దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి కాళ్లతో కొడుతూ నిరసన వ్యక్తంచేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేతలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి నిరోధకులుగా మారారని మండిపడ్డారు. అలాగే, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగడుగునా ఆటంకాలు సృష్టించటం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం గుంటూరు నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి విమర్శించారు. వికేంద్రీకరణ అంశంపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఆయన చిత్రపటాన్ని మహిళలు పాదరక్షలతో కొట్టి నిరసన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement