గూండాగిరి
- శ్రుతిమించిన ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యుల ఆగడాలు
- ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, దాడులు
- బాగేపల్లి టోల్‌ప్లాజాలో నిమ్మల తనయుల వీరంగం
- టోల్‌ఫీజు అడిగినందుకు సిబ్బందిపై దాడి
- కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం
- టోల్‌ప్లాజాపై దాడి చేయడం ఇది మూడోసారి
హిందూపురం అర్బన్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. ప్రజాప్రతినిధులు మొదలుకుని కిందిస్థాయి నాయకుల వరకు దౌర్జన్యాలు, దాడులకు దిగడం అలవాటుగా చేసుకున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. న్యాయాన్యాయాలతో పనిలేకుండా వారిపై అమాంతం దాడులకు తెగబడుతున్నారు. సోమవారం టోల్‌ఫీజు అడిగారన్న కోపంతో హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు అంబరీష్, శిరీష్ తమ అనుచరులతో కలిసి కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌ప్లాజాలో నానా బీభత్సం సృష్టించారు. సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా అక్కడి కంప్యూటర్లు, అద్దాలు ధ్వంసం చేశారు. అనంతపురం–బెంగళూరు మార్గంలోని 44వ జాతీయ రహదారిలో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు దిగడం ఇదేమీ కొత్త కాదు. సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.
టోల్‌ప్లాజాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు, కొందరు అధికారులు, ప్రముఖులకు మాత్రమే ఉచిత వాహన ప్రవేశ అనుమతి ఉంటుంది. మిగిలిన వారు తప్పనిసరిగా టోల్‌ఫీజు చెల్లించాలి. అయితే.. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు తమ వారి పాస్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. తమ వాహనాలను ఉచితంగా అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల గురించి టోల్‌ప్లాజా సిబ్బంది వారికి చెప్పినా..ఏమాత్రం వినకుండా గొడవకు దిగుతున్నారు. నిమ్మల కిష్టప్ప పెద్ద కుమారుడు అంబరీష్ కూడా ఇదేవిధంగా గొడవకు దిగాడు. అతని ఇన్నోవా కారు (ఏపీ02 బీడీ 1234)ను టోల్‌ప్లాజా సిబ్బంది అనుమతించినప్పటికీ సంతృప్తి చెందకుండా.. అతని స్నేహితులు ప్రయాణిస్తున్న ఫోర్డ్ కారు(ఏపీ02 ఈబీ 6777)ను కూడా ఉచితంగా అనుమతించాలని డిమాండ్ చేశాడు. వారు వినకపోవడంతో తన తమ్ముడు నిమ్మల శిరీష్, కొంతమంది అనుచరులను అక్కడికి పిలిపించుకుని.. అందరూ కలిసి టోల్‌ప్లాజాపై దాడి చేశారు. ఈ దాడిలో ప్లాజా ఉద్యోగి నటరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. టోల్‌ఫీజులు నమోదు చేసే కంప్యూటర్లు, పరికరాలు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి బాగేపల్లి పోలీసులు నిమ్మల కిష్టప్ప కుమారులతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నిమ్మల కుటుంబ సభ్యులు బాగేపల్లి టోల్‌ప్లాజాలో దౌర్జన్యానికి దిగడం ఇది మూడోసారి. దీంతో వారి పేరు వినగానే అక్కడి సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎంపీ సోదరుడు నిమ్మల చంద్రశేఖర్ టోల్‌ప్లాజా సిబ్బందితో గొడవపడ్డారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప పేరు చెప్పి తన వాహనాన్ని అనుమతించాలని కోరగా..అందుకు ప్లాజా సిబ్బంది నిరాకరించడంతో వివాదం తలెత్తింది. 2015 ఏప్రిల్ 5న ఎంపీ కుమారుడు అంబరీష్ కొత్తకారులో వస్తుండగా ప్లాజా సిబ్బంది నిలిపారు. దీనికి ఆగ్రహించిన ఎంపీ నిమ్మలకిష్టప్ప నేరుగా అక్కడి చేరుకుని సిబ్బందితో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనపై నిమ్మల కిష్టప్పతో పాటు మరికొందరిపై కేసు నమోదయ్యింది. అయితే.. అప్పటి ప్లాజా మేనేజర్ ఈ కేసును వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు ఎంపీ అనుచరుడు సుబ్బారెడ్డి కూడా ప్లాజా సిబ్బందితో గొడవ పడినట్లు సమాచారం. మూడోసారి కూడా నిమ్మల కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని కర్ణాటక పోలీసులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు సీరియస్‌గా తీసుకున్నారు.
ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులై ఉండి.. ఇలా దాడులు చేయడం సరికాదని చిక్‌బళ్లాపూర్ (కర్ణాటక) ఎస్పీ కార్తీక్‌రెడ్డి హితవుచెప్పారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యులు గూండాల్లో ప్రవర్తిస్తున్నారంటూ టోల్‌ప్లాజా డైరెక్టర్ ఉదయ్‌కుమార్‌సింగ్ కాస్తంత కఠినంగానే మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చామని, కొందరు రాజకీయ నేతల కారణంగా తమకు భద్రత కరువైందని టోల్‌ప్లాజా సిబ్బంది వాపోయారు. తనపై ఎంపీ తనయులు దాడి చేయడంపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని నటరాజ్ అనే ఉద్యోగి తెలిపారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించి టీడీపీ నేతల ఆగడాలను అరికట్టాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.